కాలుష్య కోరల్లో పాలమూరు!
● ఉమ్మడి జిల్లాకు పెను ముప్పుగా ఇథనాల్ కంపెనీల విస్తరణ
● ఇప్పటికే చిత్తనూర్ పరిసర ప్రాంతాలు కాలుష్యమయం
● 30 కి.మీ.ల మేర దుర్వాసన.. పంటలతోపాటు ప్రజారోగ్యంపై ప్రభావం
● వ్యతిరేకత పెల్లుబికుతున్నా హిందూపూర్‌లో వేగంగా సాగుతున్న పరిశ్రమ పనులు
● తాజాగా గద్వాల జిల్లా రాజోళి మండలంలో ఏర్పాటుకు సన్నాహాలు
● ప్రజా సంఘాల మండిపాటు.. స్థానికులతో కలిసి పోరుబాట
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జడ్చర్ల నియోజకవర్గం పోలేపల్లి సెజ్ పరిధిలో ఫార్మా పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో పరిసర ప్రాంతాల ప్రజల జీవనం నిత్యనరకంగా మారింది. జడ్చర్ల మండలంలోని పోలేపల్లి, గుండ్లగడ్డ తండా, రాజాపూర్ మండలంలోని రాయపల్లి, ముదిరెడ్డిపల్లి గ్రామాల్లో భూగర్భజలాలు కలుషితం కాగా.. పంటల సాగుతో పాటు తాగడానికి కూడా పనికి రాకుండాపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు చర్మ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు. ఇది చాలదన్నట్లు ఉమ్మడి జిల్లాలో కాలుష్యకారక ఇథనాల్ పరిశ్రమల విస్తరణ కొనసాగుతుండడం ప్రజల్లో ఆందోళన రేపుతోంది. భవిష్యత్‌లో ఈ కంపెనీలు పెను ముప్పుగా మారే అవకాశం ఉండడం వారిని బెంబేలెత్తిస్తోంది.
చిత్తనూర్.. నిశ్శబ్ద ఉద్యమం..
నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూర్ గ్రామశివారులో 430 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్ల అంచనాతో నిర్మాణమైన జూరాల ఆర్గానిక్ ఫార్‌మ్స్, ఆగ్రో ఇండస్ట్రీస్ ఎల్‌ఎల్‌పీ (యూనిట్–1) ఇథనాల్ కంపెనీ ఆసియా ఖండంలోనే పెద్దది. చిత్తనూర్, జిన్నారం, ఎక్లాస్‌పూర్ గ్రామాల మధ్య ఈ కంపెనీ ఏర్పాటైంది. ఈ కంపెనీ ఏర్పాటు మూడు గ్రామాల్లో చిచ్చురేపగా.. పచ్చని పంట పొలాల్లో మంటలు పుట్టించింది. స్థానికులు తొలి నుంచి ఈ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. దీన్ని శాశ్వతంగా రద్దు చేయాలనే డిమాండ్‌తో స్థానికులు సుమారు రెండేళ్లు ఉద్యమించారు. గతేడాది అక్టోబర్‌లో కంపెనీ నుంచి ఇథనాల్‌తో ఓ ట్యాంకర్ బయటకు రాగా.. స్థానికులు దాన్ని నిలిపివేయాలంటూ ఆందోళనకు దిగారు. ఒకరోజు మొత్తం సాగిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులపై కేసులతో ఉక్కుపాదం మోపగా.. సుమారు ఏడాదిగా నిశ్శబ్ద ఉద్యమం సాగుతోంది. పాలమూరు అధ్యయన వేదిక తదితర ప్రజాసంఘాలు వారికి మద్దతుగా గళమెత్తుతూ వస్తున్నాయి.
హిందూపూర్‌లో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు కొనసాగుతున్న పనులు
ఆ తర్వాత హిందూపూర్..
చిత్తనూరులో ఇథనాల్ కంపెనీ కార్యకలాపాలు మొదలు కాగా.. ఆ తర్వాత ఇదే నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని హిందూపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ఈ కంపెనీ ఏర్పాటుపై ఇప్పటివరకు ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదని స్థానికులు చెబుతుండగా.. మండల అధికారులు తమకేమీ తెలియదని సమాధానం ఇస్తున్నారు. కానీ కంపెనీ పనులు 50శాతం పూర్తయినట్లు తెలుస్తోంది.
30 కి.మీ.ల మేరదుర్వాసన..
కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న స్థానికులు ఆందోళన చేయకుండా ఒత్తిడి తీసుకురాగా.. ఆ మూడు గ్రామాల్లో నిశ్శబ్దం అలుముకుంది. ఈ క్రమంలో కంపెనీ పనులు పూర్తయ్యాయి. తొలుత కాలుష్యంతో కూడిన వ్యర్థజలాలను మన్నేవాగుల్లో వదలడంతో చేపలు మృత్యువాత పడ్డాయి. వాగులో స్నానాలు చేసిన పిల్లలకు శరీరంపై దద్దులు వచ్చాయి. గ్రామస్తులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. కంపెనీ నిర్వాహకులు మన్నేవాగులోకి కలుషిత నీరు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. అయితే కంపెనీ లోపల చెరువులా గుంతలు తవ్వి ఆ నీటిని అందులోకి వదులుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఇథనాల్ కంపెనీ వల్ల భవిష్యత్‌లో మరికల్, నర్వ, చిన్నచింతకుంట, ఆత్మకూర్, మక్తల్ మండలాల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉన్నట్లు పర్యావరణ వేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ కంపెనీ ప్రారంభమైన ఏడాదిలోపే చుట్టూ ఎటు చూసినా 30 కి.మీ.ల మేర దుర్వాసన వెదజల్లుతోంది. సుమారు 10 కిలోమీటర్ల వరకు పంటలపై ప్రభావం చూపుతున్నట్లు రైతులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment