అరెస్టు అప్రజాస్వామికం
నారాయణపేట: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు అప్రజాస్వామికం, అనైతికమని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఫార్మా పేరుతో రైతుల నుంచి భూములు లాక్కోవాలని చూస్తున్న ప్రభుత్వం అసలు అక్కడ నిజంగా ఫార్మా కంపెనీ పెడుతుందా.. లేక ఎవరి లబ్ధి కోసం ఇవన్నీ చేస్తున్నారు అనే అనుమానాలను ప్రజలకు స్పష్టం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వడానికి ముందు నుంచి ఆయా గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తూ ధర్నాలు, ఆందోళనలకు దిగారని, ఆ ప్రాంత మాజీ ఎమ్మెల్యేగా పట్నం నరేందర్‌రెడ్డి వారికి మద్దతుగా ఉన్నారని తెలిపారు. ఆయనకు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజాగా అధికారులపై జరిగిన దాడి ఘటనలో ఈయనను ఇరికించి వచ్చే ఎన్నికల్లో పోటీలో నిలవకూడదనే ఉద్దేశంతోనే తప్పుడు కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఉందని తెలిపారు.
మెరుగైన సేవలు అందించాలి
నారాయణపేట: మీ సేవ కేంద్రాల ద్వారా రాబోయే నూతన సర్వీసులపై నిర్వాహకులు అవగాహన కలిగి ఉండాలని డిస్ట్రిక్ట్ మేనేజర్ విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిధిలోని అన్ని మీ సేవా కేంద్రాల ఆపరేటర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ సేవ కేంద్రాల నిర్వాహకులు ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని, ప్రతి కేంద్రం ఆన్ని సర్వీసెస్ ద్వారా ప్రజలకి అందుబాటులో ఉండాలని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం సేవలకు రుసుం తీసుకోవాలని, అధికంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో డీఎం రామ్మోహన్, జిల్లాలోని అన్ని మీ సేవ కేంద్రాల ఆపరేటర్లు పాల్గొన్నారు.
వడ్లు క్వింటా రూ.3,223
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం వడ్లు (హంస) క్వింటా గరిష్టంగా రూ.3,223, కనిష్టంగా రూ.1,955 ధర పలికింది. అదేవిధంగా వడ్లు (సోనా) గరిష్టంగా రూ.2,462, కనిష్టంగా రూ.1,821 ధర పలికాయి.
తగ్గిన ఉల్లి ధర
దేవరకద్ర: స్థానికమార్కెట్ యార్డులో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలు గత వారంతో పోల్చుకుంటే కొంత వరకు తగ్గాయి. ఉదయం 10 గంటలకు వేలం ప్రారంభం కాగా.. గరిష్ట ధర రూ.2,760గా పలికింది. కనిష్టంగా రూ.1700గా నమోదైంది. గత వారం గరిష్ట ధర రూ.3,600 ఉండగా.. ఈ వారం రూ.840లు తగ్గింది. వివిధ గ్రామాల నుంచి దాదాపు రెండు వందల బస్తాల ఉల్లి అమ్మకానికి రావడంతో వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేశారు. ఇక మార్కెట్ యార్డు అంతా ధాన్యం రాసులతో నిండి పోయింది. ఆర్‌ఎన్‌ఆర్ సోనామసూరి ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,459, కనిష్టంగా రూ.1,901 లభించాయి. హంస ధాన్యం ధర గరిష్టంగా రూ.1,901, ఆముదాలు గరిష్ట ధర రూ.5789గా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment