
న్యూఢిల్లీ: రాజ్యసభలో 19 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై చర్చ జరపాలని రాజ్యసభ పోడియం ముందు విపక్ష ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. వెల్‌లోకి దూసుకొచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నందున 19 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. సభా కార్యకలాపాలను అడ్డుకొని, నిబంధనలను ఉల్లంఘించినందుకు వారం రోజులపాటు సమావేశాలకు హాజరు కాకుండా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
సస్పెండ్ అయిన ఎంపీల్లో ఏడుగురు టీఎంసీ ఎంపీలు, తెలంగాణకు చెందిన ముగ్గురు ఎంపీలు, అయిదుగురు డీఎంకే ఎంపీలు, సీపీఎం నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒక ఎంపీ ఉన్నారు. తెలంగాణ నుంచి బడుగు లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, దామోదర రావు సస్పెండ్ అయ్యారు. కాగా సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాలు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై ఉభయ సభల్లో నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు.
కాగా ప్రధానమంత్రి డెవలప్‌మెంట్ ప్యాకేజీ కింద 5,000 మంది కాశ్మీరీ వలసదారులకు ప్రభుత్వ ఉద్యోగాలు అందించినట్లు కేంద్ర హోంవ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. ‘ప్రధాన మంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద, 5,502 కాశ్మీరీ వలసదారులు ప్రభుత్వ ఉద్యోగాలను అందించాం. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ద్వారా లోయలో వివిధ విభాగాల్లో నిమగ్నమై ఉన్న కాశ్మీరీ వలస ఉద్యోగుల కోసం 6000 ట్రాన్సిట్ అకామిడేషన్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది’ అని లోక్‌సభలో నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా తెలిపారు.
చదవండి: ఎన్నికల్లో ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment