21 People Arrested In BJP Praveen Nettar Murder Case - Sakshi
Sakshi News home page

Praveen Nettar Murder Case: బీజేపీ నేత హత్య.. కేరళ నుంచి కుట్ర జరిగిందా?

Published Fri, Jul 29 2022 8:01 AM | Last Updated on Fri, Jul 29 2022 9:49 AM

21 People Arrested In BJP Praveen Nettar Murder Case - Sakshi

యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లాలో సంఘ పరివార్, బీజేపీ నాయకుడు ప్రవీణ్‌ కుమార్‌ నెట్టార్‌ హత్య కేసులో మహమ్మద్‌ షఫిక్, జాకీర్‌ అనే ఇద్దరు నిందితులను మంగళూరు పోలీసులు కేరళలో అరెస్ట్‌ చేశారు. అనుమానంతో మరో 21 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందులో 7 మంది ఎస్‌డీపీఐకి చెందిన కార్యకర్తలున్నారు.

హత్య కేసును ఏడీజీపి అలోక్‌కుమార్, పశ్చిమ విభాగం ఐజీ దేబజ్యోతి, ఎస్పీ రుషికేశ్‌ సోనావణెతో పాటు సీనియర్‌ అధికారులు గురువారం సమీక్షించారు. సీఐడీ ఎస్‌పీ అనుచేత్, హాసన్‌ ఎస్‌పీ హరిరామ్‌ శంకర్‌లను మంగళూరుకు పిలిపించి సమాచారం తీసుకున్నట్లు అలోక్‌కుమార్‌ విలేకరులకు తెలిపారు. హత్య జరిగిన సుళ్య దగ్గరి బెళ్లారెలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. దక్షిణ కన్నడ జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితి ఉండగా, పలుచోట్ల పోలీసు కవాతులు జరిగాయి. హతుని తల్లిదండ్రులు శేఖర పూజారి, రత్నావతి, భార్య నూతన్‌లను అలోక్‌కుమార్‌ కలిసి పలు వివరాలను సేకరించారు.  

ప్రతీకార హత్యగా అనుమానం 
బెళ్లారెలోని ఎస్‌డీపిఐ కార్యకర్తలను పోలీసులు విచారిస్తున్నారు. వారంతా అమాయకులని ఎస్‌డీపీఐ పేర్కొంది. కాగా ప్రధాన నిందితుడు బెళ్లారె బూడు ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు తెలిపారు. ప్రవీణ్‌ హత్యకు కేరళలో కుట్ర జరిగిందని, ఇటీవల బెళ్లారెలో కేరళ యువకుని హత్యకు ప్రతీకారంగా  ప్రవీణ్‌ను హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన బైకు కేరళ రిజిస్ట్రేషన్‌దని తెలిసింది. నా కొడుకు ఈ హత్య చేయలేదు. హత్య చేసినవారికి శిక్ష పడాలని నిందితుడు షఫీక్‌ తండ్రి  చెప్పాడు. 50 మంది కార్యకర్తలు సుళ్యలో ఒక వర్గానికి చెందిన షాపులపై దాడి చేశారు. వస్తువులను చెల్లాచెదరు చేశారు. శుక్రవారం  రాత్రి వరకు సుళ్య, పుత్తూరు, కడబ, బంటా్వళలో మద్యం అమ్మకాలను కలెక్టర్‌ బంద్‌ చేయించారు.  

కేరళ డీజీపీతో మాట్లాడాము..
నిందితులు వినియోగించిన మొబైల్‌ నంబర్లను ట్రాక్‌ చేసి ఆచూకిని పసిగట్టినట్లు డీజీపీ ప్రవీణ్‌ సూద్‌ తెలిపారు. హత్య తరువాత నిందితులు కేరళకు పరారయ్యారు. వారిని అరెస్ట్‌ చేయడానికి కేరళ డీజీపీతో మాట్లాడినట్లు తెలిపారు.  

ఎన్‌ఐఎకి అప్పగించాలి: ప్రవీణ్‌ భార్య  
ఈ హత్య కేసు విచారణను ఎన్‌ఐఎకి అప్పగించాలని హతుని భార్య నూతన డిమాండ్‌ చేశారు. నా భర్త ఎవరికీ అన్యాయం చేయలేదు, సమాజం కోసం శ్రమిస్తున్నారు. మా కుటుంబానికీ ప్రవీణ్‌ ఒక్కరే దిక్కు. ఆయనను పొట్టన పెట్టుకున్నారు. హత్య కేసును ఎన్‌ఐఎతో దర్యాప్తు చేయించాలి,  అప్పుడే న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు.  

పార్టీ నుంచి 25 లక్షల పరిహారం, ఇల్లు.. 
ప్రవీణ్‌ కుటుంబానికి పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుడు రూ.25 లక్షల పరిహారం ఇస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి అశ్వర్థనారాయణ తెలిపారు. బెంగళూరులో మాట్లాడుతూ ఇంటిని నిర్మించి ఇస్తామన్నారు. హత్యకు నిరసనగా దక్షిణ కన్నడ జిల్లాతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది యువ మోర్చా పదాధికారులు రాజీనామాలు ప్రకటించారు.   

సీఎం బొమ్మై పరామర్శ
హత్యకు గురైన ప్రవీణ్‌ నెట్టారు ఇంటికి గురువారం సాయంత్రం సీఎం బసవరాజు బొమ్మై చేరుకున్నారు. ప్రవీణ్‌ కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. సీఎం సహాయనిధి నుంచి రూ. 25 లక్షల చెక్‌ను వారికి అందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ప్రవీణ్‌ హత్య అత్యంత హేయమని, ఇదొక ముందస్తు ప్రణాళికలో జరిగిన హత్య అని చెప్పారు. దక్షిణ కన్నడ జిల్లాలో గత పదేళ్లలో అసాంఘిక శక్తుల అకృత్యాలు పెచ్చుమీరాయని తెలిపారు. కేరళ నుంచి కూడా ఈ విధమైన అకృత్యాలకు ప్రోత్సాహం అందుతోందన్నారు. హత్య కేసులో ఇప్పుడే దర్యాప్తు ప్రారంభమైందని, అతి త్వరగా నిందితులందరిని అరెస్టు చేస్తామన్నారు. ఈ కేసును ఎన్‌ఐఏ విచారణకు ఇచ్చే యోచన ఉన్నట్లు తెలిపారు. ప్రవీణ్‌ అంత్యక్రియల సందర్భంగా లాఠీచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఇదే సమయంలో పక్కనే ఉన్న ప్రజలు సీఎంను కోరారు.   

దొడ్డబళ్లాపురం: బీజేపీ, సీఎం బసవరాజ బొమ్మై ఎంతో భారీఎత్తున జరుపతలపెట్టిన బల ప్రదర్శన సభ... జనోత్సవ రద్దయింది. బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్‌ నెట్టారు హత్యకు గురికావడమే రద్దుకు కారణం. దొడ్డబళ్లాపురంలో గురువారంనాడు అంగరంగ వైభవంగా జనోత్సవ సభను నిర్వహించాలని సుమారు నెల నుంచి ఏర్పాట్లు చేశారు. రద్దు వల్ల కొన్ని కోట్ల రూపాయలు వ్యర్థమయ్యాయి. లక్ష మంది కోసం వేసిన భారీ కటౌట్లు, సెట్టింగులు, బ్యానర్లు, బంటింగ్స్‌ తొలగించారు. నేతలు, కార్యకర్తల తరలింపు కోసం బస్సులు, వీఐపీల కోసం అద్దెకు తీసుకున్న వాహనాలు అన్నీ రద్దయ్యాయి. 

సమావేశం స్థలి వద్ద భారీ వంటశాలలో సుమారు వందమంది చేయితిరిగిన వంట మనుషులు 25 వేలమందికి ఉదయం ఉపాహారంగా పలావ్, పులిహోర వండారు. మధ్యాహ్నం లక్ష మంది కార్యకర్తల కోసం భోజనం తయారీకి బియ్యం, పప్పులు, ధాన్యాలు, కూరగాయలు స్వీట్లు సిద్ధం చేశారు. తీరా సభ లేదనగానే స్థానిక బీజేపీ నేతలు షాక్‌కు గురయ్యారు. తరువాత తేరుకుని వండిన ఆహారం వృథా కాకూడదని తాలూకాలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు పంపించారు. రెండు టన్నుల కూరగాయలను ఘాటిలోని గోశాలకు తరలించారు. చాలా ఆలస్యంగా సభ రద్దు నిర్ణయం తీసుకొన్నారని నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement