శనివారం పుష్పాలంకరణతో మెరిసిపోతున్న అయోధ్య రామాలయం లోపలి ప్రాంగణం
అయోధ్య/న్యూఢిల్లీ: రామాలయ ప్రారంభోత్సం, బాలరాముని ప్రాణప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ అయోధ్య మరింత శోభాయమానంగా మారుతోంది. నగమంతటా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. ఎటు చూసినా ‘శుభవేళ రానే వచ్చింది’, ‘అయోధ్య సిద్ధమైంది’ అంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఆహూతులకు హార్దిక స్వాగతం పలుకుతున్నాయి.
లౌడ్‌స్పీకర్ల నిండా రామ నామం, భక్తి గీతాలు మార్మోగుతున్నాయి. అయోధ్య అణువణువూ రామమయంగా మారింది. రామాలయ ప్రారంభ సన్నాహాలు తుది దశకు చేరుతున్నాయి. గర్భాలయంలో కొలువుదీరిన బాలరాముని విగ్రహాన్ని శనివారం పవిత్ర సరయూ నదీజలాలతో అభిషేకించారు.
గర్భాలయాన్ని కూడా నదీ జలాలతో సంప్రోక్షణ చేశారు. మంత్రోచ్చారణ నడుమ శుదీ్ధకరణ కార్యక్రమాలు ముగిశాయి. అనంతరం శా్రస్తోక్తంగా వాస్తు శాంతి, అన్నాధివాస, పుష్పాధివాస క్రతువులు జరిపారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన ప్రసాదాలు, పుష్పాలతో బాలరామునికి నివేదన జరిపారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలు, ప్రత్యేక విద్యుద్దీపాలతో అలంకరించారు. బాలరామునికి ఆదివారం 125 కలశాలతో మంగళస్నానం జరగనుంది...
దర్శనాలకు బ్రేక్
తాత్కాలిక మందిరంలో పూజలందుకుంటున్న ప్రస్తుత రామ్‌లల్లా విగ్రహాన్ని నూతన గర్భాలయంలోకి చేర్చే ప్రక్రియకు కూడా అర్చకులు శ్రీకారం చుట్టారు. నూతన విగ్రహంతో పాటు ఈ విగ్రహాన్ని కూడా గర్భాలయంలో ప్రతిష్టించనుండటం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం నుంచే తాత్కాలిక ఆలయంలో దర్శనాలు నిలిపేశారు. ఈ విగ్రహాన్ని బహుశా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా గర్భాలయంలోకి తీసుకెళ్తారని అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ అభిప్రాయపడ్డారు. గుడారం నుంచి తాత్కాలిక మందిరంలోకి కూడా ఈ విగ్రహాన్ని ఆదిత్యనాథే తీసుకెళ్లారు.
విమానాల వరద...
అయోధ్యకు వీఐపీల రాక ఇప్పటికే మొదలైంది. ఆదివారం నాటికి ఇది ఊపందుకోనుంది. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి దాదాపు 7,000 మందికి ఆహా్వనాలు అందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని అయోధ్యకు చేరవేసేందుకు సోమవారం ఏకంగా 100కు పైగా చార్టర్డ్ ఫ్లైట్లు రానున్నట్టు చెబుతున్నారు. వీటి తాకిడిని తట్టుకోవడం కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి శక్తికి మించిన పనే కానుంది.
ఇప్పటికే 40కి పైగా విమానాల ల్యాండింగ్‌కు విజ్ఞప్తులు అందినట్టు చెబుతున్నారు. కానీ నిబంధనల ప్రకారం ప్రధాని ప్రయాణించే ఎయిరిండియా వన్ ల్యాండయ్యాక విమానాశ్రయంలోకి మరే విమానాన్నీ అనుమతించరు. ఈ నేపథ్యంలో వీఐపీలు దిగీ దిగగానే వచి్చన విమానాన్ని వచి్చనట్టే వారణాసి, లఖ్‌నవూ తదితర సమీప విమానాశ్రయాలకు పంపనున్నారు. ప్రధాని వెనుదిరిగాక వాటిని ఒక్కొక్కటిగా తిరిగి అయోధ్యకు అనుమతిస్తారు.
2 నెలలు..2 కోట్ల మంది!
రామాలయ ప్రారంభం అనంతరం అయోధ్యకు దేశ నలుమూలల నుంచీ భారీగా భక్తులను తరలించేలా బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జనవరి 25 నుంచి మార్చి 25 దాకా 2 కోట్ల మందికి దర్శనం కలి్పంచనుంది. ఒక్కో లోక్‌సభ నియోజవర్గం నుంచి 5 వేల మంది చొప్పున మొత్తం 543 లోక్‌సభ స్థానాల నుంచీ భక్తులను తరలించనుంది. ఇందుకోసం వందలాది ప్రత్యేక రైళ్లతో పాటు బస్సులు తదితర ఏర్పాట్లు చేస్తోంది.
ఫొటోలు లీకయ్యాయి: పూజారి
ప్రాణప్రతిష్టకు ముందే బాలరాముని విగ్రహం ఫొటోలు లీకవడంపై అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. దీనిపై దర్యాప్తుకు డిమాండ్ చేశారు. ‘‘ప్రాణప్రతిష్ట జరగకుండా మూలవిరాట్టు ఫొటోలు విడుదల చేయడం సరికాదు. ముఖ్యంగా నేత్రాలను బహిర్గతపరచడం పూర్తిగా నిషిద్ధం. కళ్లు కనిపిస్తున్నది అసలు విగ్రహం కాదు.
ఒకవేళ అది అసలు విగ్రహమే అయితే ఫొటోను లీక్ చేసిందెవరో కనిపెట్టి శిక్షించాలి’’ అని కోరారు. ప్రాణప్రతిష్ట జరగనున్న బాలరామునికి సంబంధించి శుక్రవారం రెండు ఫొటోలు వెలుగు చూడటం తెలిసిందే. ఒకదాంట్లో కళ్లకు పసుపు వస్త్రం కట్టి ఉండగా మరొక దాంట్లో కళ్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాణప్రతిష్టకు సంబంధించి ఎలాంటి తప్పుడు కంటెంట్‌నూ వ్యాప్తి చేయొద్దని ప్రింట్, టీవీ మీడియాతో పాటు సోషల్ మీడియా వేదికలకు కేంద్రం సూచించింది.
యజమానులుగా 14 మంది దంపతులు
ప్రాణప్రతిçష్ట క్రతువులో 14 మంది దంపతులు ముఖ్య యజమానులుగా పాల్గొననున్నారు. వీరిని దేశవ్యాప్తంగా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఈశాన్య ప్రాంతాల నుంచి ఎంపిక చేశారు. వీరందరి సమగ్ర భాగస్వామ్యంలో పూజలు, క్రతువులు జరుగుతాయని రామ జన్మభూమి ట్రస్టు వర్గాలను ఉటంకిస్తూ ఆరెస్సెస్ నేత సునీల్ అంబేడ్కర్ వివరించారు.
జైషే బెదిరింపులు
ప్రాణప్రతిష్ట సమీపిస్తున్న వేళ అయోధ్యలో కల్లోలం సృష్టిస్తామంటూ పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చేసిన హెచ్చరిక అలజడి రేపుతోంది. హింసాత్మక ప్రతీకారం తప్పదని శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో హెచ్చరించడంతో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. నిఘా వర్గాలు పరిస్థితిని డేగ కళ్లతో గమనిస్తున్నాయి.
‘రామ’ రైల్వేస్టేషన్లకు విద్యుత్ వెలుగులు
రామన్నపేట్ (తెలంగాణ). రామచంద్రపురం (ఆంధ్రప్రదేశ్). రామగిరి (కర్ణాటక). ఇవన్నీ రాముని పేరుతో ఉన్న రైల్వేస్టేషన్లు. ఇలా దేశవ్యాప్తంగా మొత్తం 343 రైల్వేస్టేషన్లున్నాయి. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇవన్నీ విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోనున్నాయి. రైల్వే శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాముని పేరిట ఉన్న రైల్వేస్టేషన్లలో అత్యధికంగా 55 ఏపీలో ఉండటం విశేషం!
1,265 కిలోల లడ్డూ, 400 కిలోల తాళం
అయోధ్య రామునికి దేశ విదేశాల నుంచి వినూత్న కానుకల వరద కొనసాగుతూనే ఉంది. వీటిలో భాగంగా ఏకంగా 1,265 కిలోల లడ్డూ, 400 కిలోల తాళం శనివారం అయోధ్య చేరాయి. లడ్డూను హైదరాబాద్‌కు చెందిన నాగభూషణంరెడ్డి అనే భక్తుడు, తాళాన్ని యూపీలోని అలీగఢ్‌కు చెందిన సత్యప్రకాశ్ శర్మ దంపతులు తయారు చేయించారు. శర్మ ఇటీవలే మరణించారు. తాళాన్ని రామునికి సమరి్పంచాలంటూ చివరి కోరిక కోరారు. ఆ మేరకు ఆయన భార్య దాన్ని అయోధ్య చేర్చారు. దీన్ని ప్రపంచంలోకెల్లా అతి పెద్ద తాళంగా చెబుతున్నారు. తాళాల తయారీకి అలీగఢ్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. 25 మంది 3 రోజుల పాటు శ్రమించి లడ్డూను తయారు చేసినట్టు నాగభూషణంరెడ్డి చెప్పారు. ఇది నెల రోజుల పాటు పాడవకుండా ఉంటుందన్నారు.
ప్రత్యేక ప్రసాదాలు
ప్రాణప్రతిష్ట సందర్భంగా ప్రత్యేక ప్రసాదాలు అలరించనున్నాయి. టెప్లా, బాదం మిఠాయి, మటర్ కచోరీ తదితరాలను సోమవారం బాలరామునికి నివేదిస్తారు. అనంతరం వాటిని, తిరుమల శ్రీవారి లడ్డూలు, 1,265 కిలోల భారీ లడ్డూతో పాటు దేశ నలుమూలల నుంచి వచి్చన ఇతర ప్రసాదాలను భక్తులకు అందిస్తారు. మరోవైపు బాలరాముని నివేదన కోసం లక్నో నుంచి ఛప్పన్ భోగ్ (56 రకాల భోజన పదార్థాల)తో కూడిన వెండి థాలీ కూడా అయోధ్యకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment