
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ దాటి.. థర్డ్ వేవ్‌లోకి ప్రవేశించిందని. అది కూడా పీక్ స్టేజ్‌లో ఉందని తెలిపారు. అయితే మరోసారి లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ నవంబర్‌లోనే ప్రారంభం అయ్యింది. పీక్ స్టేజ్‌లో ఉంది. ప్రజలంతా మాస్క్‌లు ధరించి ఉండటం మంచింది. ప్రజలు నమ్మకం కోల్పోకుండా.. తమని తాము కాపాడుకుంటూ.. ఇతరులను కాపాడితే మేలు’ అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సత్యేంద్ర జైన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో నమోదవుతున్న కేసులకు సరిపడా ఐసీయు బెడ్స్ అందుబాటులో లేవు. దాంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బెడ్స్ కొరత ఏర్పడే అవకాశం ఉంది. (చదవండి: ముంబైలో తగ్గిన దీపావళి సప్పుడు)
ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, గవర్నర్ అనిల్ బైజాల్ ఇతర ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు అమిత్ షా అధ్యక్షతన ఈ భేటీ జరిగిన సంగతి తెలిసిందే. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘మహమ్మారి విజృంభణ సమయంలో కేంద్ర ప్రభుత్వం, హోం మంత్రి అమిత్ షా ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు అన్ని విభాగాలు కలిసి పని చేస్తాయి. ప్రజల కోసం కేంద్రం డీఆర్‌డీఓ సెంటర్‌లో 750 బెడ్స్‌ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చింది. అలానే ఢిల్లీలో టెస్టుల సంఖ్య 1-1.25 లక్షలకు పెంచుతామని తెలిపింది’ అన్నారు. ఇక అక్టోబర్ 20 నుంచి దేశ రాజధానిలో కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. బెడ్లు ఉన్నాయి కానీ.. ఐసీయూ బెడ్స్ కొరత ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment