సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి వ్యాక్సినేషన్ ఉపయోగపడుతుందా? ఈ వైరస్‌కు టీకాలతో చెక్ చెప్పొచ్చా? అంటే వైద్య నిపుణులు ఔననే చెబుతున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించడంతోపాటు వ్యాక్సినేషన్‌తో దీనికి అడ్డుకట్ట వేయొచ్చని పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విజయవంతంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియతో కరోనా వ్యాప్తి తగ్గడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు.
ప్రస్తుతం మనదేశంలో కరోనా కల్లోలం రేపుతోంది. ఈ పరిస్థితిని గతంలోనే అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఎదుర్కొన్నాయి. బ్రిటన్, స్పెయిన్, అమెరికా, ఇజ్రాయెల్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలు క్లిష్ట పరిస్థితిని చవిచూశాయి. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ సమయంలో మాత్రం ఆయా దేశాలు తీసుకున్న జాగ్రత్తలు కరోనాను అడ్డుకున్నాయి. ముఖ్యంగా వ్యాక్సిన్ ఈ విషయంలో బాగా పనిచేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ఆయా దేశాల్లో పాజిటివ్ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది.
యూకేలో ప్రస్తుతం రోజుకు 2వేల లోపే కేసులు..
గతేడాది కరోనా మహమ్మారి కారణంగా యూకే మొత్తం అతలాకుతలమైంది. ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. అయితే కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించడంతో పాటు లాక్‌డౌన్ విధించడం, ప్రజలకు యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్లు అందించడంతో ఇప్పుడు అక్కడ పరిస్థితి చాలా మారింది. యూకే జనాభాలో ఇప్పటికే 49% మందికి టీకాలు వేశారు. దీంతో కరోనా పాజిటివ్ కేసుల్లో ఏకంగా 97% తగ్గుదల కనిపించింది.
వ్యాక్సినేషన్ కంటే ముందు ప్రతిరోజూ దేశవ్యాప్తంగా 60 వేల నుంచి 70వేల కొత్త కేసులు వచ్చేవి. ఆస్పత్రుల్లో పడకల కొరతతో ప్రతిరోజూ వెయ్యి నుంచి 1,200 మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 8న వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. ఫిబ్రవరి నుంచి కరోనా సోకినవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు రోజుకు వెయ్యి నుంచి 2వేల లోపు మాత్రమే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు ఆంక్షలు ఎత్తివేస్తున్నారు.
ఇజ్రాయెల్ మాస్క్ నిబంధనా ఎత్తివేత..
కరోనా సంక్షోభం నుంచి ఇజ్రాయిల్ దాదాపుగా బయటపడింది. అక్కడి జనాభాలో 61% మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. దీంతో మాస్క్‌లు ధరించాలన్న నిబంధన తొలగించారు. దాదాపు అన్ని కార్యకలాపాలు గాడినపడ్డాయి. పర్యాటకులను సైతం అనుమతిస్తున్నారు. ఇజ్రాయెల్ ఇలా సాధారణ స్థితికి చేరడానికి వ్యాక్సినేషనే కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో దేశంలోని 90% జనాభాకు వ్యాక్సిన్లు వేయాలని అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. టీకాలు వేయకముందు రోజుకు దాదాపు 10వేల కేసులు వస్తుండగా.. ప్రస్తుతం అవి వందల్లోకి తగ్గాయి.
వ్యాక్సిన్ ఎంత వేగంగా వేస్తే అంత మంచిది..
వ్యాక్సినేషన్ ప్రక్రియ భారత్‌లోనూ సానుకూల ప్రభావం చూపిస్తోందని నిపుణులు అంటున్నారు. దేశంలో అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవాక్సిన్ టీకాలను ప్రజలకు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13,83,79,832 వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. ఇప్పటివరకు టీకా వేయించుకున్నవారిలో కేవలం 0.035% మందికి మాత్రమే కరోనా సోకినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ఎంత వేగంగా జరిగితే అంతే వేగంగా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దేశంలో 45 ఏళ్ల పైబడినవారికి వ్యాక్సిన్ ఇస్తుండగా.. మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్ల పైబడినవారికి కూడా టీకాలు వేయనున్నారు.
అల్లకల్లోలం నుంచి బయటపడుతున్న అమెరికా..
కరోనా మొదలైన తర్వాత అత్యంత దారుణ పరిస్థితులను అనుభవించిన దేశం అమెరికా. కేసులు, మరణాల్లో తొలి స్థానంలోనే ఉండేది. ప్రతిరోజూ దాదాపు లక్ష నుంచి 3 లక్షల వరకు కేసులు నమోదయ్యేవి. రోజుకు 2వేల నుంచి 6వేల మంది చనిపోయారు. అయితే, యుద్ధప్రాతిపదిక నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ కారణంగా కేసులు గణనీయంగా తగ్గాయి. ఇప్పటివరకు అమెరికా జనాభాలో 39.56% మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. దీంతో కరోనా సంక్రమణ రేటు తగ్గింది. గతంలో రోజుకు మూడు లక్షల వరకు కొత్త కేసులు రాగా.. ప్రస్తుతం అది 60 వేల నుంచి 70వేలకు తగ్గింది.
ఇక వ్యాక్సినేషన్ కారణంగా స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీల్లోనూ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. స్పెయిన్‌లో జనవరి నాటికి ప్రతీరోజు 25 వేల నుంచి 30వేల కేసులు నమోదుకాగా.. 20% వ్యాక్సినేషన్‌తో ఆ సంఖ్య 8 వేల నుంచి 10వేలకు తగ్గింది. అలాగే జర్మనీలో ప్రస్తుతం 20.07% మంది జనాభాకు టీకాలు వేయడం పూర్తయింది. దీంతో అక్కడ కూడా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య తగ్గింది. గతేడాది కరోనా ప్రకోపానికి వణికిపోయిన ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు 18.73% మందికి వ్యాక్సిన్లు వేశారు. ఫలితంగా అక్కడా కేసులు తగ్గుతున్నాయి. ఈనెల మొదట్లో రోజుకు అక్కడ దాదాపు 60వేల కొత్త కేసులు రాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 25వేల నుంచి 35వేల మధ్య నమోదవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment