Couple found dead in bathroom after Holi celebrations in Ghaziabad - Sakshi
Sakshi News home page

విషాదం నింపిన హోలీ.. బాత్‌రూమ్‌లోకి వెళ్లి భార్యభర్తలు మృతి!

Mar 10 2023 5:37 PM | Updated on Mar 10 2023 7:09 PM

Couple Found Dead In Bathroom in Ghaziabad After Holi Celebrations - Sakshi

ఉత్తర ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్‌లోని బాత్‌రూమ్‌లో ఓ జంట అనుమానాస్పదంగా మృత్యువాతపడింది. హోలీ అనంతరం స్నానం కోసం వెళ్లిన దంపతులు బాత్‌రూమ్‌లో శవమై కనిపించారు. ఈ దురదృష్ట ఘటన ఘజియాబాద్‌ జిల్లా మురాద్‌నగర్‌ పట్టణంలోని అగ్రసేన్ మార్కెట్ సమీపంలో వెలుగు చూసింది. మృతిచెందిన దంపతులను దీప్కా గోయల్ (40), అతని భార్య శిల్పి (36)గా గుర్తించారు.

వివరాలు.. తమ కుటుంబ సభ్యులతో గోయల్‌​, శిల్పి గురువారం ఎంతో ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. తర్వాత మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రంగులు కడుక్కొని, స్నానం చేసేందుకు బాత్‌రూమ్‌లోకి వెళ్లిన జంట తిరిగి బయటకు రాలేదు. అనుమానించిన కుటుంబ సభ్యులు బలవంతంగా బాత్‌రూమ్‌ తలుపులు పగలగొట్టి చూడగా.. ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే దంపతులను ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం దంపతుల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. అయితే బాత్‌రూమ్‌లో సరైన వెంటిలేషన్‌ లేకపోవడం, గీజర్‌ నుంచి వెలువడే విష వాయువుల వల్లే ఊపిరాడక చనిపోయి ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇళ్లంతా తనిఖీ చేసినప్పటికీ ఎలాంటి అనుమానాస్పదంగా అనిపించలేదని తెలిపారు. కాగా, పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతనే వారి మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

మరో ఘటనలో మోదీనగర్‌లో హోలీ వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ 30 ఏళ్ల వినీత్ కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పద గుండెపోటుతో మరణించాడు. లక్ష్మీ నగర్ నివాసికి చెందిన వినీత్‌ హోలీ వేడుకల్లో డ్యాన్స్ చేస్తున్న సమయంలో కుప్పకూలిపోయాడు. గమనించిన  కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ అతను చనిపోయినట్లు డాక్టర్లు  ప్రకటించారు. కేసు నమోదు చేసుకున్న  పోలీసులు గుండెపోటుతో మృతిచెందినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement