న్యూఢిల్లీ: దేశంలో వార్త సంస్థలు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిపై రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. ఫేసుబుక్, గూగుల్, యూట్యూబ్ వంటి టెక్ దిగ్గజాలు వార్తలను షేర్ చేస్తున్న మీడియా సంస్థలకు యాడ్ రెవెన్యూలో కొంత మొత్తాన్ని చెల్లించే విధంగా భారతదేశం ఒక చట్టాన్ని రూపొందించాలని బిజెపి సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోడీ బుధవారం రాజ్యసభలో డిమాండ్ చేశారు. “గూగుల్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో షేర్ చేస్తున్న వార్తల వల్ల ఆయా టెక్ కంపెనీలు పెద్ద మొత్తంలో యాడ్ రెవెన్యూను ఆర్జిస్తున్నాయి. దీని వల్లే రెవెన్యూ తగ్గి దేశంలోని సాంప్రదాయ మీడియా కష్టాలు ఎదుర్కొంటుంది. అందువల్ల, ఆయా కంపెనీలు తమ యాడ్ రెవెన్యూలో కొంత మొత్తాన్ని సాంప్రదాయ మీడియా సంస్థలకు చెల్లించాల్సిందే” అని ఆయన డిమాండ్ చేశారు.
గత నెలలో ప్రపంచంలో మొదటి సారిగా న్యూస్ మీడియా షేర్ చేసే కంటెంట్‌కు తగిన ఆదాయం లభించేలా ఆస్త్రేలియా ప్రభుత్వం తరహా కొత్త చట్టాన్ని రూపొందించింది. ఇప్పుడు అదే మాదిరి ఒక కొత్త చట్టాన్ని రూపొందించి భారత పార్లమెంట్లో పాస్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. రాజ్యసభ చైర్మన్, ఉపాధ్యక్షుడు ఎం.వెంకయ్య నాయుడు ఈ సూచనను పరిగణనలోకి తీసుకోవడం విలువైనదని వ్యాఖ్యానించారు. సాంప్రదాయ మీడియా సంస్థలు, పత్రికలు ఇటీవలి కాలంలో చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా కారణంగా ప్రజలు పేపర్ వేయించుకోవడానికి భయపడడం, ప్రింట్ మీడియాపై ఆసక్తి చూపకపోవడం, యాడ్ రెవెన్యూ తగ్గడం వంటి కారణాలతో సిబ్బంది జీతాలు కూడా చెల్లించలేక కొన్ని పత్రికలు మూసేయాల్సిన పరిస్థితి తలెత్తింది.
సాంప్రదాయ పత్రికలు, వార్తా ప్రసార మాధ్యమాలు టెక్ దిగ్గజాలు నడుపుతున్న ప్లాట్‌ఫామ్‌లలో ఉచితంగా వార్తలను షేర్ చేస్తున్నాయి. ప్రకటనలు మాత్రం ఎక్కువగా టెక్ ప్లాట్‌ఫామ్‌లలో వస్తున్నందున అవి చాలా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి అన్నారు. సాంప్రదాయ వార్తా మాధ్యమాలు నమ్మదగిన వార్తలను అందించడానికి వ్యాఖ్యాతలు, పాత్రికేయులు, విలేకరులను కోసం భారీ పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది అన్నారు. అయితే, వాణిజ్య ప్రకటనల ద్వారానే వాటికి ఆదాయం వస్తుంది. కానీ, అటువంటి ఆదాయాన్ని టెక్ కంపెనీలు లాగేస్తున్నాయని ఆయన వాపోయారు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం తప్పనిసరిగా చట్టం చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తుచేశారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment