సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల మహా సంగ్రామానికి ముందు సెమీస్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు అధికార కాషాయ దళానికి, విపక్ష కాంగ్రెస్ పార్టీకి అగి్నపరీక్షగా మారాయి. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో తన అధికార పీఠాన్ని సుస్థిర పరుచుకోవాలంటే ప్రస్తుత ఎన్నికల్లో మెజార్టీ రాష్ట్రాలను దక్కించుకునేలా బీజేపీ ఇప్పటికే కదనరంగంలోకి దిగింది.
తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలను కాపాడుకుంటూనే మరో రెండు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ కాలుదువ్వుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్తాన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార మార్పిడి జరుగుతుందని బీజేపీ నమ్మకంగా ఉంటే.. బీజేపీ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్‌ను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నమ్మకంగా ఉంది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో రెండు పార్టీల పట్టు నిలుపుకునేందుకు, మిజోరంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు పోరాడుతుండటంతో ఈ ఎన్నికలకు రసవత్తరంగా ఉండనున్నాయి.
పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో...
త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో పెద్దదైన మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు గానూ 2018 ఎన్నికల్లో 114 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచి్చంది. కాంగ్రెస్ సీనియర్ నేత, ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడ్డ జ్యోతిరాదిత్య సింధియా 2020లో సొంతపార్టీలోని 21 మంది ఎమ్మెల్యేలతో కాషాయ కండువా కప్పుకోవడంతో అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది
దీనిపై ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న కాంగ్రెస్ అక్కడ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు చెమటోడ్చుతోంది. వరుసగా తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచిన కమల్‌నాథ్ ప్రస్తుతం పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను బలంగా వాడుతున్నారు. బీజేపీ కూడా కేంద్ర మంత్రులు, లోక్‌సభ ఎంపీలను అసెంబ్లీ బరిలో నిలిపింది. కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న డిసెంబర్ 2018 నుంచి మార్చి 2020 మినహా దాదాపు రెండు దశాబ్దాలుగా మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది.
రాజస్తాన్ కీలకం
రాజస్తాన్‌లో ఏ ప్రభుత్వమూ వరుసగా రెండోసారి ఎన్నికకాని చరిత్ర ఉంది. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు ప్రత్యర్థి పార్టీకి అవకాశం కలి్పస్తున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలోని ఇతర వెనుకబడిన తరగతుల ఓట్లే కీలకంగా ఉండటంతో వాటిపైనే ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి.
అదే సమయంలో, కాంగ్రెస్‌కు చెందిన సీఎం గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ల మధ్య విరోధం నివురు గప్పిన నిప్పులా ఉంది. రాజస్తాన్‌లో కాషాయ జెండా రెపరెపలాడాలని చూస్తున్న బీజేపీ అక్కడ ‘ఆప్నో రాజస్తాన్’పేరిట ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రధాని మోదీ నాలుగుసార్లు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరుమార్లు పర్యటించారు.
ఛత్తీస్‌గఢ్ ఎవరిదో?
పదిహేనేళ్ల పాలన తర్వాత 2018లో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ఎలాగైనా ఛత్తీస్‌గఢ్‌ను తిరిగి నిలబెట్టుకునే కృతనిశ్చయంతో ఉండగా ఇక్కడ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. 90 స్థానాలున్న రాష్ట్రంలో 68 సీట్లతో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్, ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు ఉన్న ఇమేజ్‌కు తోడు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు తమను తిరిగి అధికారంలోకి తేవొ చ్చని కాంగ్రెస్ వర్గాలు విశ్వసిస్తోంది. రాష్ట్రంలోని కీలక రంగాల్లో జరిగిన అవినీతి తమకు లాభిస్తుందని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే ప్రధాని మూడుసార్లు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. ఇటీవలి ఇండియా టుడే–సీవోటర్ ఒపీనియన్ పోల్‌లో 90 సీట్లలో 46 శాతం ఓట్లతో 51 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందన్న అంచనాలు బీజేపీకి మింగుడుపడటం లేదు.
తెలంగాణలో త్రిముఖం..
తెలంగాణ ఇచి్చన కాంగ్రెస్, తెలంగాణ తెచి్చన బీఆర్‌ఎస్‌ల మధ్య ప్రధాని పోటీ ఉందనుకుంటున్న 119 సీట్లున్న తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులతో బీజేపీ సైతం పోటీలోకి వచి్చంది. త్రిముఖ పోటీ ఉండే అవకాశాలతో తాము అధికారంలోకి వస్తామని బీజేపీ నమ్ముతుంటే, అతిపెద్ద పార్టీగా తామే అవతరిస్తామన్న గట్టి నమ్మకంతో కాంగ్రెస్ ఉంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు, పార్టీకి ఉన్న ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్‌లతో పాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను ఎన్నికల బరిలో నిలపనుంది. గడిచిన 15 రోజుల్లోనే రెండుసార్లు తెలంగాణలో మోదీ పర్యటించారు. కర్ణాటక ఎన్నికల్లో లబ్ధి పొందిన మాదిరే ఇక్కడా 6 గ్యారెంటీ కార్డు హామీలతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది.
మిజోరంలో స్థానిక పార్టీలదే హవా
క్రైస్తవులు మెజారిటీగా ఉన్న మిజోరంలో స్థానిక పార్టీలైన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్), జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పీఎం) పార్టీలదే హవా నడుస్తోంది. 40 స్థానాలున్న మిజోరంలో ప్రస్తుతం అక్కడ ముఖ్యమంత్రి జోరమ్‌తంగా నేతృత్వంలోని ఎంఎన్‌ఎఫ్ ప్రభుత్వం 28 సీట్లతో అధికారంలో ఉండగా, జెడ్‌పీఎం 9 సీట్లు, కాంగ్రెస్ 5, బీజేపీ ఒక్క సీటు సాధించుకున్నాయి. రెండు పర్యాయాలకు ఒకమారు అధికారం మారే మిజోరంలో ఈ ఏడాది ఎంఎన్‌ఎఫ్‌దే విజయమని సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి. మయన్మార్ శరణార్థులే ప్రధాన అంశంగా ప్రస్తుత ఎన్నికలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment