గ్యాంగ్‌టక్: సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 14కు చేరుకుంది. అదేవిధంగా, 22 మంది ఆర్మీ అధికారులు సహా గల్లంతైన వారి సంఖ్య 98కు పెరిగింది. ఉత్తర సిక్కింలో తీస్తా నదీ పరీవాహక ప్రాంతంలోని ఎల్‌హొనాక్ సరస్సు ఉప్పొంగి సంభవించిన వరదల్లో గల్లంతైన మరో ఆరుగురి మృతదేహాలు లభ్యం కావడంతో మరణాల సంఖ్య 18కు చేరుకుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎస్‌ఎస్‌డీఎంఏ) గురువారం బులెటిన్‌లో తెలిపింది.
ఇప్పటివరకు 2,011 మందిని కాపాడినట్లు పేర్కొంది. గల్లంతైన 22 మంది జవాన్ల ఆచూకీ కోసం దిగువ ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని వివరించింది. ఇలా ఉండగా, వరదల్లో కొట్టుకువచ్చిన 18 మృతదేహాల్లో నాలుగు జవాన్లవని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. ఇవి సిక్కింలో గల్లంతైన జవాన్ల మృతదేహాలా కాదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలతో చుంగ్‌థంగ్ డ్యామ్ ధ్వంసం కావడం.. విద్యుత్ మౌలిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతినడంతోపాటు నాలుగు జిల్లాల్లోని పలు గ్రామాలు, పట్టణాలు జల దిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. మంగన్ జిల్లాలోని 8 వంతెనలు సహా మొత్తం 11 బ్రిడ్జీలు వరదల్లో కొట్టుకుపోయాయి. రాష్ట్రానికి గుండెకాయ వంటి పదో నంబర్ రహదారి పలుచోట్ల ధ్వంసమైంది. చుంగ్‌థంగ్ పట్టణం తీవ్రంగా దెబ్బతింది. తీస్తా నదికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలున్నందున, పరీవాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని ఎస్‌ఎస్‌డీఎంఏ కోరింది. సిక్కింలోని వేర్వేరు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకుపోయిన వేల మంది పర్యాటకుల్లో విదేశీయులూ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment