
న్యూఢిల్లీ: ఎగువ హరియాణా ప్రాంతాల నుంచి ప్రవహిస్తున్న వరదనీటితో ఢిల్లీలో యమునా నది మహోగ్రంగా మారింది. దీంతో నది ప్రవాహంలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ముంపు ప్రాంతాల్లోని వేలాది మంది ప్రజలను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.
సోమవారం రాత్రి నుంచే ఈ తరలింపు ప్రక్రియ మొదలుపెట్టారు. సంబంధిత వివరాలను ఢిల్లీ రాష్ట్ర జలశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ పత్రికా సమావేశంలో వెల్లడించారు. ‘ ముంపు ప్రాంతాల స్థానికుల కోసం వేలాది టెంట్‌లను ఈస్ట్, నార్త్, నార్త్‌ఈస్ట్, సౌత్‌ఈస్ట్, సెంట్రల్, షాదారా జిల్లాల్లో ఏర్పాటుచేశాం.
హరియాణాలోని హాత్నీ కుండ్ బ్యారేజ్ నుంచి వరదనీటిని దిగువకు వదలడం వల్లే ఢిల్లీలో ఈ అప్రమత్త పరిస్థితి దాపురించింది. అయితే ఢిల్లీకి వరదలు మాత్రం రాబోవు. నదీ పరివాహక ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వరదనీరు చేరదు. శిబిరాల్లో ఇప్పటికే ఆహారం, తాగునీరు, ఇతర వసతులు సిద్ధంచేశాం’ అని ఆయన చెప్పారు.