లక్నో: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కారణం ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి ఇతర ప్రధాన పార్టీలతో పాటు ఓ ట్రాన్స్‌జెండర్ కూడా పోటీ చేస్తున్నారు.
వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై అఖిల భారత హిందూ మహాసభ (ABHM) ఉత్తరప్రదేశ్ విభాగం తరఫున మహామండలేశ్వర్ హేమాంగి సఖి మా పోటీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారణాసితో సహా ఉత్తరప్రదేశ్‌లోని 20 లోక్‌సభ స్థానాల్లో ఈ హిందూ మితవాద సంస్థ పోటీ చేయనుంది. ఈ ఎన్నికలలో చివరి దశలో జూన్ 1న వారణాసిలో పోలింగ్ జరగనుంది.
వారణాసి నుంచి కాంగ్రెస్ తమ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చీఫ్ అజయ్ రాయ్‌ను పోటీకి దింపింది. 2019లో వారణాసిలో ప్రధాని మోదీ 63 శాతం ఓట్లతో విజయం సాధించారు . సమాజ్‌వాదీ పార్టీకి చెందిన షాలినీ యాదవ్ తర్వాత రాయ్ మూడో స్థానంలో నిలిచారు. ఇండియా కూటమిలో భాగంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి.
మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ గీతా బోధకురాలు
హేమాంగి సఖి గుజరాత్‌లోని బరోడాలో జన్మించారు. ఆమె తండ్రి సినిమా డిస్ట్రిబ్యూటర్ కావడంతో ఆమె కుటుంబం ముంబైకి మారింది. సఖి కొంతకాలం కాన్వెంట్ స్కూల్‌లో చదువుకున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె పాఠశాల వదిలి వెళ్లిపోయారు. కొన్ని చిత్రాలలో నటించిన ఆమె ప్రముఖ టీవీ షోలలో కూడా కనిపించారు.
ముంబైలోని తన ఇంటికి సమీపంలో ఉన్న ఇస్కాన్ ఆలయంలో సఖికి శ్రీకృష్ణునిపై భక్తిప్రపత్తులు ప్రారంభమయ్యాయి. చివరికి బృందావనంలో దిగింది. తరువాత, ఆమె హేమాంగి సఖి మాగా మారారు. ఆమె ప్రపంచంలోని మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ భగవద్గీత బోధకురాలు. తన ఫేస్‌బుక్ పేజీ ప్రకారం ఆమె ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికలలో భగవద్ కథ , రామ కథ, దేవి భగవత్ కథలను బోధించారు.
2019లో పట్టాభిషేకం
2019 ఫిబ్రవరిలో జరిగిన కుంభంలో ఆచార్య మహామండలేశ్వర్‌గా ఆమె పట్టాభిషేకం జరిగింది. ఆమెను అఖిల భారతీయ సాధు సమాజ్ భగవత్భూషణ్ మహామండలేశ్వర్ బిరుదుతో సత్కరించింది. ఉత్తర గోదావరి ధామ్‌లోని ఆద్య శంకర్ కైలాష్ పీఠం ఆమెకు ఆచార్య మహామండలేశ్వర్ బిరుదును ప్రదానం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment