
హిమాచల్ ప్రదేశ్‌లో తాజాగా కురుస్తున్న మంచు కారణంగా ఐదు జాతీయ రహదారులతో సహా 475 రహదారులు మూతపడ్డాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతంలో మంచు కురుస్తున్న కారణంగా 333 విద్యుత్ సరఫరా పథకాలు, 57 నీటి సరఫరా పథకాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
హిమపాతం కారణంగా చంబాలో 56, కాంగ్రాలో ఒకటి, కిన్నౌర్‌లో ఆరు, మండిలో 51, సిమ్లాలో 133 రోడ్లు మూసుకుపోయాయని విపత్తు నిర్వహణ విభాగం పేర్కొంది. అంతకుముందు శనివారం రాష్ట్రంలో 504 రహదారులను మూసివేశారు. వీటిలో నాలుగు జాతీయ రహదారులు ఉన్నాయి. అంతేకాకుండా పలు చోట్ల మంచు కురుస్తుండటంతో విద్యుత్ సరఫరా, నీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది.
జిల్లాలోని లాహౌల్-స్పితిలోని తొమ్మిది ప్రాంతాలలో మంచు తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. లాహౌల్ స్పితి పోలీసులు తమ సోషల్ మీడియా హ్యాండిల్‌లో జిల్లా వాతావరణం, రహదారి పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేశారు. నూతన సంవత్సరం ప్రారంభమైనది మొదలు హిమాచల్ ప్రదేశ్‌కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నారు. అయితే హిమాచల్ ప్రదేశ్‌కు వచ్చే పర్యాటకులు ఇక్కడి వాతావరణ పరిస్థితులను తెలుసుకుని ప్రయాణానికి ప్లాన్ చేసుకోవాలని స్థానిక పోలీసులు సూచిస్తున్నారు.