
ఢిల్లీ: స్వతంత్ర, సార్వభౌమత్వ పాలస్తీనా దేశ ఏర్పాటుకు భారత్ మద్దతు ఇస్తోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం చెప్పారు. భారత్ చాలా ఏళ్లుగా ఇదే వైఖరి కొనసాగిస్తోందని తెలిపారు. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు చర్చలు పున:ప్రారంభం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాలు శాంతియుతంగా కలిసి జీవించాలని భారత్ ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
గుర్తించిన సరిహద్దుల మధ్య పాలస్తీనా ప్రజలు భద్రమైన జీవితం గడపాలన్నదే భారత్ విధానమని, అందులో ఎలాంటి మార్పు లేదని అరిందమ్ బాగ్చీ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలైన తర్వాత పాలస్తీనా అంశంపై భారత్ నుంచి ఇలాంటి ప్రకటన రావడం ఇదే మొదటిసారి. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖండించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: గాజాపై భూతల యుద్ధం!