టీవీ మహిళా జర్నలిస్టు హత్యకేసు: ఆ దుర్మార్గులదే ఈ పని! | Journalist Soumya Vishwanathan Murder Case: 5 Accused Convicted After 15 Years - Sakshi
Sakshi News home page

టీవీ మహిళా జర్నలిస్టు హత్యకేసు: ఆ దుర్మార్గులదే ఈ పని!

Published Wed, Oct 18 2023 5:02 PM | Last Updated on Wed, Oct 18 2023 6:52 PM

Justice for journalist Soumya Vishwanathan after 15 years killers convicted - Sakshi

Justice for journalist Soumya Vishwanathan యువ మహిళా టీవీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్‌ హత్యకేసులో ఎట్టకేలకు  న్యాయం జరిగింది. సంచలనం రేపిన ఈ కేసులో ఐదుగురు నిందితులను  కోర్టు దోషిలుగా నిర్ధారించింది.  రవికపూర్, అమిత్ శుక్లా, అజయ్ కుమార్, బల్జీత్ మాలిక్, అజయ్ సేథీలను సాకేత్ కోర్టు దోషులుగా బుధవారం  తేల్చి చెప్పింది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత   ఈ కేసులో కీలక పరిణామం  చోటు చేసుకుంది.  

జర్నలిస్ట్ సౌమ్యా విశ్వనాథన్ 2008 సెప్టెంబరు 30న ఢిల్లీలో తన కారులో గాయాలతో శవమై కనిపించారు. ఇది తొలుత యాక్సిడెంట్  కేసుగా నమోదుచేశారు. కానీ తలపై తుపాకీతో కాల్చినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది.  ఆ తరువాత  సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా  నిందితులను గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు.  2009 మార్చిలో నిందితులను పోలీసులు అదుపులోకి  విచారించగా సౌమ్యాను తామే హత్య చేసినట్లు అంగీకరించారు. 

తుపాకితో కాల్చి ఆమెను అతి కిరాతకంగా హత్య చేసిన దుండుగులు.. మృతదేహాన్ని కారులో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పోలీసులు తేల్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జిత్ మాలిక్, అక్షయ్ కుమార్‌, అజయ్ సేథిలను దోషులుగా తేల్చింది. అంతేకాదు, మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చట్టంలోని నిబంధనల ప్రకారం దోపిడి కేసులోనూ దోషులుగా పేర్కొంది.

వీరిలో రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జిత్ మాలిక్, అక్షయ్‌లను హత్య, దోపిడీ కేసులో దోషులుగా నిర్దారించిన కోర్టు.. వీరికి సహకరించినందుకు ఐదో నిందితుడు అజయ్‌ను కూడా దోషిగా  ప్రకటించింది.  పదిహేనేళ్ల  సుదీర్ఘ విచారణను అక్టోబరు 13న పూర్తిచేసిన సాకేత్ కోర్టు అడిషినల్ సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ పాండే.. తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే.  డిఫెన్స్, ప్రాసిక్యూషన్‌ ఈ నెల ప్రారంభంలో తమ వాదనలను పూర్తి చేయడంతో అదనపు వాదనలు లేదా వివరణల కోసం నాలుగు రోజులు సమయం ఇచ్చారు. ఎటువంటి అభ్యర్థనలు రాకపోవడంతో తీర్పును బుధవారం వెలువరించారు. (‘‘క్లిక్‌ చేసి వాట్సాప్‌ ఛానెల్‌ ఫాలో అవ్వండి’’)

పోయిన నా బిడ్డ ఎలాగూ తిరిగి రాదు,కానీ : తల్లి  ఆవేదన
కోర్టు తీర్పుపై సౌమ్యా విశ్వనాథన్‌ తల్లి  మాధవి విశ్వనాథన్ భావోద్వేగానికి  లోనయ్యారు. తన కూతురు  ఎలాగూ చనిపోయింది.. ఆమె తిరిగి రాదు కానీ ఈ తీర్పు నేరస్థుల్లో భయాన్ని రేపుతుంది. లేదంటే వాళ్లు మరింత రెచ్చిపోతారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా ఈ కేసును విచారించిన పోలీసు అధికారిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. కనీసం వారికి జీవిత ఖైదు విధించాలని కోరారు. (భీకర పోరు: సాహో ఇండియన్‌ సూపర్‌ విమెన్‌, వైరల్‌ వీడియో)

జిగిషాను హత్యచేసిన వాళ్లే  సౌమ్యాను కూడా 
ఇది ఇలా ఉంటే కాల్ సెంటర్ ఉద్యోగి  జిగిషా ఘోష్ హత్యలో వీళ్లేనేరస్థులు కావడం గమనార్హం. జిగిషా హత్యలో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడంతోనే విశ్వనాథన్ హత్య కేసును కూడా ఛేదించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.  ఈ కేసులో రవి కపూర్ అమిత్ శుక్లా లను తొలుత అరెస్టు చేశారు. అనంతర బల్జీత్ మాలిక్, అజయ్ సేథీలతో పాటు వారిపై ఛార్జ్ షీట్ (జూన్ 2010)  దాఖలు చేశారు. నవంబర్ 2010లో విచారణ ప్రారంభమైంది. విచారణ జూలై 2016లో ముగిసింది. కపూర్, శుక్లాలకు మరణశిక్ష, మాలిక్‌కు ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే, జనవరి 2018లో కపూర్, శుక్లాల మరణశిక్షను హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. అయితే మాలిక్ జీవిత ఖైదును సమర్థించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement