సాక్షి, బెంగళూరు: జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు న్యాయస్థానంలో భారీ షాక్ తగిలింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు పొందుపరిచినందుకు ఎంపీగా రేవణ్ణ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కర్ణాటక హైకోర్టు ప్రకటించింది. అతడి ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. ఆరేళ్ల పాటు ఏ ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు తీర్పులో పేర్కొంది.
కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణ జేడీఎస్ తరఫున హసన్ లోక్‌సభ స్థానానికి ఎంపీగా గెలిచారు. ఆ ఎన్నికల్లో జేడీఎస్ తరపున లోక్‌సభకు ఎన్నికైన ఒకే ఒక్క నేత ప్రజ్వల్. అయితే రేవణ్ణ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని, ఎన్నికల కమిషన్‌కు తన ఆస్తులను ప్రకటించలేదని ఆరోపిస్తూ ఆయనపై కర్ణాటక హైకోర్టు రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.
నియోజకవర్గానికి చెందిన ఓటరు జీ దేవరాజేగౌడతోపాటు రేవర్ణ చేతిలో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఏ మంజు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై శుక్రవారం జస్టిస్ కె నటరాజన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చింది నిజమేనని తేల్చింది. ఎంపీగా అతడి ఎన్నిక చెల్లదని చెప్పింది.
చదవండి: ఆదిత్య ఎల్1: సూర్యుడిపై సరికొత్త ప్రయోగం.. US, చైనాకు ధీటుగా..
అంతేగాక వచ్చే 6 సంవత్సరాల పాటు రేవణ్ణ ఏ విధమైన ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. అలాగే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినందుకు ప్రజ్వల్ రేవణ్ణపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉండగానే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై హైకోర్టు అనర్హత వేటు వేయడం గమనార్హం.
అయితే, రేవణ్ణ అనర్హతతో తనను ఎంపీగా ప్రకటించాలని బీజేపీ అభ్యర్థి మంజు కోరగా... ఆమె అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. మంజు పైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. ఇక లోక్‌భ ఎన్నికల్లో రేవణ్ణపై బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన మంజు ఆ తరువాత జీడీఎస్‌లో చేరారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment