చిన్న కుక్కపిల్ల కస్టడీకోసం మాజీ సహచరునితో కావచ్చు.. పార్లమెంటులో ఏకంగా ప్రధాని మోదీతో కావచ్చు... మహువా మొయిత్రా అంటేనే పోరాటం. తెలివైన వ్యక్తి. ఆధునికంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఎక్కడ తప్పు జరిగినా ప్రశి్నస్తారు. పార్లమెంటులో బలమైన స్వరం. ఎంపీగా ఎన్నికైన నాటినుంచే మోదీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారారు. ఆ క్రమంలో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. అంతే వివాదాస్పద రీతిలో నోటుకు ప్రశ్నల కేసులో లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు కూడా.
కాంగ్రెస్‌లో మొదలై...
దాదాపు 15 ఏళ్ల క్రితం ‘ఆమ్ ఆద్మీ కా సిపాహీ’ ప్రచారానికి నాటి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎంపిక చేసిన యువజన కాంగ్రెస్ నాయకురాలిగా తొలిసారిగా మీడియా దృష్టిని ఆకర్షించారు మహువా. 1974 అక్టోబర్ 12 న అస్సాంలోని కచార్ జిల్లా లాబాక్‌లో జన్మించిన ఆమె అమెరికాలోని మసాచుసెట్స్‌లో మౌంట్ హోలియోక్ కాలేజీలో పై చదువులు చదివారు. అమెరికన్ మల్టీ నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్‌లో బ్యాంకర్‌గా న్యూయార్క్‌లో, లండన్‌లో పనిచేశారు.
2009లో ఉద్యోగం వదిలి భారత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలుత కాంగ్రెస్‌లో చేరినా 2010లో తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2016 పశి్చమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. 2019లో కృష్ణానగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అక్కడా అదే వాగ్ధాటి కొనసాగించారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో ప్రధాని మోదీ సంబంధం గురించి పదేపదే సభలో ప్రశ్నలు లేవనెత్తారు. ఈసారీ కృష్ణానగర్ నుంచే పోటీ చేస్తున్నారు...
కొత్త రోల్ మోడల్స్ కావాలి..
ఖరీదైన బూట్లు, బ్రాండెడ్ బ్యాగులు కొనడానికి తనకు లంచాలు అవసరం లేదంటూ ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టారు మొయిత్రా. తనపై ఆరోపణలను భారత రాజకీయాల్లో ఇమిడి ఉన్న స్త్రీ ద్వేషంలో భాగంగా అభివర్ణించారు. ‘‘నేను ప్రగతిశీల కుటుంబంనుంచి వచ్చాను. భారతీయ స్త్రీ ఇలాగే ఉండాలనే మూస పద్ధతిలో పెరగలేదు. తృణమూల్ ఓ మహిళ సారథ్యంలో ఉంది.
మమత మహిళలను ప్రోత్సహిస్తారు. అందుకే ఆ పార్టీలో చేరా. పార్లమెంటులో సగం మంది మహిళా ఎంపీలు టీఎంసీ వాళ్లే. ఎందుకంటే బెంగాల్‌లో స్త్రీలను శక్తిగా భావిస్తాం. మెదడున్న, గా చదువుకున్న, ఆర్థిక అవగాహన, ఆత్మవిశ్వాసమున్న స్త్రీని సగటు భారతీయ పురుషుడు, నాయకుడు ఎదుర్కోలేడు’’ అంటూ కుండబద్దలు కొడతారు. ప్రజా జీవితంలో ఉన్న మహిళలకు సరికొత్త రోల్ మోడల్స్ అవసరమంటారు.
‘కుక్కపిల్ల కస్టడీ’ తో సీటుకే ఎసరు...
పెంపుడు కుక్కపిల్ల కస్టడీ వ్యవహారం పార్లమెంటు నుంచి మొయిత్రా బహిష్కరణకు దారితీసింది. మాజీ సహచరుడు జై అనంత్ దెహద్రాయ్ నుంచి తమ పెంపుడు కుక్కపిల్ల కస్టడీ కోరుతూ కోర్టుకెక్కారు. ప్రతిగా అదానీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి మొయిత్రా భారీగా లంచం, బహుమతులు తీసుకుంంటున్నారంటూ సీబీఐకి ఫిర్యాదు చేశారు. వ్యవహారం పార్లమెంటు ఎథిక్స్ కమిటీ విచారణ దాకా వెళ్లింది. పార్లమెంట్ లాగిన్ ఐడీని ఇతరులతో పంచుకున్నందుకు ఆమెను దోషిగా తేల్చి 2023 డిసెంబర్ 8న లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment