
నేటి మహాశివరాత్రితో ముగియనున్న మహాకుంభమేళా
చివరిరోజు కోటి మంది పుణ్య స్నానాలు ఆచరించే వీలు
కట్టుదిట్టమైన భద్రత, రక్షణ ఏర్పాట్లు చేసిన యోగి ప్రభుత్వం
మహాకుంభ్ నగర్(యూపీ): కోట్లాది మంది భక్తుల శరణ ఘోష, ఆధ్యాత్మిక పరిమళాల మధ్య భక్త జన కోటి పుణ్య స్నానాలు, వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీకి కొనసాగింపుగా ‘మహా కుంభమేళా’గా వినతికెక్కిన మహత్తర ఆధ్యాత్మిక వేడుక ఎట్టకేలకు చిట్టచివరకు చేరుకుంది.
గత 44 రోజులుగా త్రివేణి సంగమ క్షేత్రంలో అప్రతిహతంగా కొనసాగుతూ కోట్లాది మంది భక్తుల పవిత్ర స్నానాలతో కిక్కిరిసిన ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా ఘాట్లు బుధవారం తుదిఅంకంలో భాగంగా మహాశివరాత్రితో మరోసారి ఇసుకేస్తే రాలనంత జనసంద్రంగా మారనున్నాయి. నేడు మహా శివరాత్రిని పురస్కరించుకుని కోటి మంది భక్తులు చిట్టచివరిదైన ‘అమృత్ స్నాన్’ క్రతువులో పాలుపంచుకోనున్నారని ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఘాట్‌ల వద్దకు భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అంతటా వాహనాలను నిషేధించారు.
‘నో వెహికల్ జోన్’గా ప్రకటించారు. ఇటీవల త్రివేణి సంగం ఘాట్‌లో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు ప్రాణాలుకోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం మరింతగా పోలీసు బలగాలను మొహరించింది. చిట్టచివరి రోజు కావడంతో భక్తులు తాకిడి అనూహ్యంగా ఉండొచ్చన్న అంచనాలతో ప్రభుత్వం అన్ని రకాలుగా సర్వసన్నద్ధమైంది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో కుంభమేళా భక్తుల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఘాట్‌ల వద్ద ఒకేచోట జనం పోగుబడకుండా ప్రత్యేక పర్యవేక్షణా బలగాలను రంగంలోకి దింపారు.
Comments
Please login to add a commentAdd a comment