ఒక్కోసారి చిన్నచిన్న సరదాలే ప్రాణాలమీదకు తీసుకొస్తుంటాయి. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో స్నేహితులు చేసిన మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఒక యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. స్నేహితులు పెట్టిన షరతులకు మించి మూమూస్ తినడంతో ఆ యువకుడు అనారోగ్యం పాలయ్యాడని, అనంతరం ఊపిరి తీసుకోలేక ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు చెబుతున్నారు. అయితే మృతుని తండ్రి ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ తన కుమారునికి విషం ఇచ్చి చంపేశారని ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం గోపాల్‌గంజ్‌లో కొందరు స్నేహితులు ఎంజాయ్ చేస్తూ, వారిలోవారు మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్ పెట్టుకున్నారు. దీనిలో పాల్గొన్న బిపిన్ కుమార్(25) ఛాలెంజ్‌కు మించి అధికంగా మూమూస్ తిన్నాడు. దీంతో ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. బిపిన్ పరిస్థితిని గమనించిన అతని స్నేహితులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితుడిని పరిశీలించి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
బిపిన్ ఒక మొబైల్ రిపేరింగ్ దుకాణంలో పనిచేస్తుంటాడు. కుమారుని మృతి నేపధ్యంలో అతని తండ్రి మాట్లాడుతూ తన కుమారుని చేత విషం తినిపించారని, తన కుమారుడిని అతని స్నేహితులే హత్య చేశారని ఆరోపించారు. వారంతా ఉద్దేశపూర్వకంగానే ఈ ఛాలెంజ్ చేసి, తన కుమారుడని హత్యచేశారని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: సరస్సును ఖాళీ చేయిస్తారట.. ఎందుకంటే
Comments
Please login to add a commentAdd a comment