ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధానిలో జరిగిన 'సశక్త్ నారీ-విక్షిత్ భారత్' కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల స్థాయిని పెంపొందించడానికి అవకాశాలను కల్పించే ప్రభుత్వం మాత్రమే ముందుకు సాగుతుందని ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి అధికారంలోకి వస్తే.. మహిళా శక్తిని (ఉమెన్ పవర్) పెంచడంలో కొత్త అధ్యాయాన్ని లికించనున్నట్లు పేర్కొన్నారు.
గతంలో మహిళల జీవితాలకు, కష్టాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని మోదీ గత ప్రభుత్వాల మీద విరుచుకుపడ్డారు. మరుగుదొడ్లు లేకపోవడం, శానిటరీ ప్యాడ్‌ల వాడకం, కలప పొగ వల్ల వంటశాలలో కలిగే ఇబ్బందులు, బొగ్గు వంటి వాటి వల్ల కలిగే దుష్పరిణామాలు, బ్యాంక్ అకౌంట్ ఆవశ్యకత వంటి మహిళలకు సంబంధించిన అనేక సమస్యల గురించి మాట్లాడిన మొదటి ప్రధాని తానేనని మోదీ అన్నారు.
తన ప్రయాణం సమయంలో ఇల్లు, పరిసరాలు, గ్రామాలలో వ్యక్తిగత అనుభవాల నుంచి ఎన్నో తెలుసుకున్నానని మోదీ పేర్కొన్నారు. మహిళలకు ప్రయోజనం చేకూర్చడానికి ఉద్దేశించిన వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రూ. 8 లక్షల కోట్లకు పైగా మహిళలు లాభం పొందారని అన్నారు. అంతే కాకుండా కోటి మందికి పైగా మహిళలు 'లఖపతి దీదీలు'గా మారారని మోడీ వెల్లడించారు.
మహిళలకు చిన్నపాటి సహాయం చేస్తే వారు ఇతరులకు సహాయం చేస్తారనేది తన అనుభవమని ప్రధాని అన్నారు. తమ కుటుంబాల గురించి మాత్రమే ఆలోచించే రాజకీయ నాయకులు దీనిని ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అన్నారు.
'సశక్త్ నారీ-విక్షిత్ భారత్' కార్యక్రమంలో.. స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జీ) మోదీ బ్యాంకు రుణాలుగా సుమారు రూ.8,000 కోట్లను పంపిణీ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా లబ్ధిదారులతో ఆయన సంభాషించారు, వారి పనిలోని వివిధ అంశాలను అడిగి తెలుసుకుని, వారి కృషి.. సంకల్పాన్ని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment