న్యూఢిల్లీ: దేశంలోని ఆదివాసీల అభ్యున్నతి కోసం కేంద్రం ఎంతో చేస్తోందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మెగా జాతీయ ఆదివాసీల ఉత్సవం ‘ఆది మహోత్సవ్’ను గురువారం ప్రధాని ప్రారంభించారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు ఎలా ఉంటాయో చాటి చెప్పడానికి, ఆదివాసీలు తయారు చేసిన వస్తువులు, ఆహార పదార్థాలు విక్రయించడానికి అవకాశం కల్పిస్తూ వారి అభ్యున్నతి కోసం తాము అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి కృషి చేస్తున్నామని తెలిపారు.
బడ్జెట్‌లో నిధులు భారీగా కేటాయిస్తున్నామని, మొట్టమొదటి సారిగా ఆదివాసీ మహిళ ద్రౌపదీ ముర్ముని రాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టినది తమ ప్రభుత్వమేనని సగర్వంగా చెబుతున్నామని పేర్కొన్నారు. ఢిల్లీ దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లోని ప్రజలందరూ తప్పనిసరిగా ఆది మహోత్సవ్‌ను సందర్శించి, ఆదివాసీలు తయారు చేసిన వస్తువుల్ని కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంంలో ఆదివాసీల పాత్ర మరువలేనిదని, వారి త్యాగాలను గుర్తుంచుకోవాలన్నారు. అమృత కాలంలో ఆదివాసీలను తిరిగి వెలుగులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుంటున్నామని మోదీ తెలిపారు.
బొట్టు బొట్టు కాపాడుకోవాలి
దేశంలో నీటి సంరక్షణ అత్యంత ఆందోళన కలిగించే అంశమని మోదీ అన్నారు. ప్రకృతితో మనకున్న భావోద్వేగ బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకొని నీటి వనరుల్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర జల శక్తి శాఖ, బ్రహ్మకుమారిలు సంయుక్తంగా నిర్వహిస్తున్న దేశవ్యాప్త ప్రచారం జల్ జన్ అభియాన్‌ను ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు. రాజస్థాన్‌లోని బ్రహ్మకుమారిల ప్రధాన కార్యాలయంలో ఉన్న వారినుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment