ఇండోర్: అత్యాధునిక సాంకేతికతలను వినియోగించడంలో ఉద్యోగులకు, కార్మికులకు తగిన శిక్షణ ఇవ్వాలని, వారిలో నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కొత్త తరం కార్మికులకు కొత్త తరం విధానాలను అందుబాటులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జి–20 దేశాల కార్మిక, ఉద్యోగ కల్పన శాఖ మంత్రుల సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో మొబైల్ వర్క్‌ఫోర్స్ అనేది వాస్తవ రూపం దాల్చబోతోందని ఉద్ఘాటించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగో పారిశ్రామిక విప్లవ హయాంలో ఉద్యోగాల సృష్టికి టెక్నాలజీకి ఒక ముఖ్యమైన సాధనంగా మారిందని గుర్తుచేశారు. నూతన ఉద్యోగాల కల్పనలో ఇకపైకూడా టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. భవిష్యత్తులో ఉద్యోగులకు, కార్మికులకు స్కిల్లింగ్, రీ–స్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ అనేది కీలకం కాబోతోందని అభిప్రాయపడ్డారు. ఆధునిక సాంకేతికతల వినియోగంలో నైపుణ్యాలు తప్పనిసరిగా పెంచుకోవాలని సూచించారు. వర్క్‌ఫోర్స్‌ను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారత్‌లో ‘స్కిల్ ఇండియా మిషన్’ ప్రారంభించామని తెలియజేశారు.
నైపుణ్యాలను పంచుకోవాలి
నైపుణ్యాలను అభివృద్ధి చేయడంతోపాటు వాటిని ఇతర దేశాలతో పంచుకొనే విషయంలో జి–20 దేశాలు చొరవ తీసుకోవాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. నైపుణ్యాల సమాచారం ఇచి్చపుచ్చుకోవాలన్నారు. భారత్‌లో కోవిడ్–19 వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ఫ్రంట్‌లైన్ ఆరోగ్య సిబ్బంది, ఇతర ఉద్యోగులు, కార్మికులు ఎనలేని సేవలు అందించారని, వారు తమ నైపుణ్యాలను, అంకితభావాన్ని ప్రదర్శించారని మోదీ కొనియాడారు. సేవా సంస్కృతిని చాటిచెప్పారని, సాటి మనుషుల పట్ల కరుణ కురిపించారని ప్రశంసించారు.
నైపుణ్యం కలిగిన కార్మికులను ప్రపంచానికి అందించగల అతిపెద్ద దేశంగా ఎదిగే సామర్థ్యం భారత్‌కు ఉందని స్పష్టం చేశారు. సాంకేతికతలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలను సృష్టించడంలో భారత్‌కు అపార అనుభవం ఉందని వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధిపై తాము ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పారు. కౌశల్ వికాస్ యోజన కింద కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్ వంటి రంగాల్లో నైపుణ్యాలు పెంచుతున్నామని పేర్కొన్నారు. ఈ–శ్రమ్ పోర్టల్‌లో 21.8 కోట్ల మంది కార్మికులు నమోదయ్యారని మోదీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment