న్యూఢిల్లీ: ఆవు హిందువులకు ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆలానే ఆవు పేడ, మూత్రాన్ని కూడా అనేక రకాలుగా వినియోగిస్తారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తాను ప్రతి రోజు ఆవు మూత్రం తాగుతానని తెలిపారు. ఇక ఆవు పేడను కూడా ఇప్పటికే దీన్ని ఎన్నో ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఆవు పేడ గురించి రాష్ట్రీయ కామధేను ఆయోగ్ చైర్మన్ వల్లభాయ్ కతిరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవు పేడకు రేడియేషన్‌ను ఎదుర్కోవడంతోపాటు దాన్ని తగ్గించే సామర్ధ్యం ఉందని కతిరియా తెలిపారు. ఆవు పేడతో తయారైన చిప్‌ని ప్రదర్శించిన కతిరియా మీడియాతో మాట్లాడారు. మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నపుడు మనుషులను ప్రభావితం చేసే రేడియేషన్‌ని నివారించడానికి ఈ ఆవు పేడ చిప్ సహాయపడుతుందని ఆయన చెప్పారు. ‘‘ఆవు పేడ ప్రతి ఒక్కరినీ రక్షిస్తుంది, దీనికి రేడియేషన్ నిరోధకత ఉందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఆవు పేడ ఉత్పత్తులను ఇంట్లో ఉంచడం వల్ల ఇది ప్రజలను రేడియేషన్ నుంచి రక్షిస్తుంది’’ అన్నారు కతిరియా. (చదవండి: అమెరికాలో పిడకల వేట!)
ఫోన్లలో ఆవుపేడ ఆధారిత చిప్ ఉంచితే అది వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని ఆయన చెప్పారు. ఆవు పేడ చిప్‌ని ఆవిష్కరించిన కామధేను ఆయోగ్ ఛైర్మన్ దానికి ‘గౌసత్వా కవచ్’ అని పేరు పెట్టారు. రేడియేషన్ వల్ల వచ్చే వ్యాధులను నివారించాలనుకుంటే, ఆవు పేడతో చేసిన చిప్‌ను ఫోన్‌లలో వాడాలని కతిరియా ప్రజలకు సూచించారు. దేశవ్యాప్తంగా గోవధను అరికట్టడమే కాకుండా వీటి ఉత్పత్తులను శాస్త్రీయంగా నిర్ధారించి ప్రోత్సహిచేందుకు కేంద్రం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ కామధేను ఆయోగ్ సంస్ధను ఏర్పాటు చేసింది. ఈ సంస్ధ గోవులకు సంబంధించిన ప్రతీ ఉత్పత్తిని శాస్త్రీయంగా పరీక్షించి వాటిని జనంలోకి విస్తృతంగా వ్యాప్తి చేస్తుంది. ఇప్పుడు రేడియేషన్‌కు వ్యతిరేకంగా పనిచేసే ఆవు పేడతో తయారు చేసిన చిప్‌ను సంస్ధ విడుదల చేసింది. దీన్ని మొబైల్ ఫోన్లలో ఉపయోగించడం ద్వారా రేడియేషన్ నుంచి కాపాడుకోవచ్చని చెబుతోంది. ‘గౌసత్వ కవచ్’ పేరుతో రూపొందించిన ఈ చిప్‌ను గుజరాత్‌కు చెందిన ఓ గోశాల తయారు చేసినట్లు కేంద్రం చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment