
న్యూఢిల్లీ: లోక్‌సభలో మరో అరుదైన, ఆసక్తికరమైన దృశ్యం చోటుచేసుకుంది. హుందాగా నడుచుకుంటామని పలువురు విపక్ష సభ్యులు హామీ ఇవ్వడంతో స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం సభలో అడుగుపెట్టి కార్యకలాపాలను నడిపించారు. సభా కార్యకలాపాలకు సభ్యులు పదేపదే అడ్డుకుంటుండటం పట్ల మంగళవారం ఆయన తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చడం, వారి ప్రవర్తనకు హుందాగా లేదంటూ ఆక్షేపించడం, ఇక సభకు రాబోనని ప్రకటించడం తెలిసిందే. ఆ మేరకు బుధవారమంతా స్పీకర్ లోక్‌సభకు దూరంగా ఉన్నారు.
గురువారం ఉదయం కూడా ప్రశ్నోత్తరాలయ్యే దాకా సభకు రాలేదు. దాంతో, ‘స్పీకర్ సభకు రావాలన్నది విపక్ష సభ్యులందరి కోరిక. ఆయన్ను సభ మొత్తం ఇష్టపడుతుంది’’ అని అదీర్ రంజన్ చౌధరి (కాంగ్రెస్) అన్నారు. ‘‘ఎన్ని భేదాభిప్రాయాలున్నా మాట్లాడుకుని పరిష్కరించుకుందాం. స్పీకర్ మన నాయకుడు’’ అని చెప్పారు. అనంతరం అదీర్ నేతృత్వంలో విపక్ష నేతలు సౌగాథా రాయ్ (తృణమూల్), కనిమొళి (డీఎంకే), సుప్రియా సులే (ఎన్సీపీ) తదితరులతో పాటు మంత్రి గడ్కరీ సైతం బిర్లా చాంబర్‌కు వెళ్లి సభకు రావాల్సిందిగా కోరారు.
జీఎన్‌సీటీడీ (సవరణ) బిల్లును లోక్‌సభ ఆమోదిస్తుండగా ఆప్ ఎంపీ సుశీల్ రింకూ వెల్‌లోకి దూసుకొచ్చి కాగితాలు చించి స్పీకర్‌కేసి విసిరారు. దాంతో సమావేశాలు పూర్తయ్యేదాకా ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
చదవండి: parliament session: డేటా దుర్వినియోగం చేస్తే రూ.250 కోట్ల జరిమానా