సాక్షి, న్యూఢిల్లీ: ట్రైబ్యునళ్లలో ఖాళీలు భర్తీ చేయకుండా వాటిని నిర్వీర్యం చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అహనం వ్యక్తం చేసింది. వారంలోగా తీరు మార్చుకోవాలని పేర్కొంది. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్, ఢిల్లీ బార్ అసోసియేషన్, స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ మధ్యప్రదేశ్, అమర్‌జీత్ సింగ్ బేడిలు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ నాగేశ్వరరావులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు వాఖ్యలు చేసింది.
మూడు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి:
కోర్టు తీర్పుల్ని కేంద్రం గౌరవించడంలేదని స్పష్టంగా అర్థమవుతోందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని కేంద్రంపై అసహనం వ్యక్తం చేశారు. ట్రైబ్యునళ్లలో ఎన్ని ఖాళీలు భర్తీ చేయాలో చెప్పండి, ఆయా అంశాలపై ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏడాదిన్నరగా ఖాళీలు భర్తీ కాక మూసివేత దశలోకి వచ్చేలా ఉన్నా... ట్రైబ్యునళ్లలో ఎందుకు నియామకాలు చేపట్టడం లేదని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తమకు మూడు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
1. కొత్త చట్టం అమలుపై స్టే ఇచ్చి ట్రైబ్యునళ్లను మూసివేయడం.
2. సుప్రీంకోర్టే ట్రైబ్యునళ్లలో ఖాళీలు భర్తీ చేయడం.
3. కేంద్రంపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టడం.
కేంద్రంతో ఘర్షణ పడాలని తాము భావించడం లేదని, ఇటీవల సుప్రీంకోర్టుకు తొమ్మిది మంది న్యాయమూర్తుల నియామకం విషయంలో కొలీజియం సిఫారసులను ఆమోదించినందుకు సంతోషంగా ఉందని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. అయితే, ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఖాళీలతో చైర్‌పర్సన్లు, సభ్యులు లేక ట్రైబ్యునళ్లు కూలిపోయేలా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఖాళీలు భర్తీ చేయకుండా వాటి నిర్వీర్యానికి కారణం అవుతున్నారని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు అన్నారు. కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ట్రైబ్యునళ్లను మూసివేసే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ‘ట్రైబ్యునల్ సంస్కరణల చట్టం నోటిఫై అయినట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
కొత్త చట్టం ఖాళీల భర్తీకి మార్గం సుగమం చేస్తుంది. సెర్చ్, సెలక్షన్ కమిటీ సిఫారసులను కేంద్రం తీసుకుంటుంది’ అని తుషార్ మెహతా తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ), నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)వంటి వాటిల్లో అనేక ఖాళీలున్నాయని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ట్రిబ్యునళ్లలో ఖాళీల వల్ల అనేక కేసులు పరిష్కారం కావడం లేదన్నారు. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా బ్యూరోక్రాట్లతో సమావేశమై పలు పేర్లు సిఫారసు చేశామని, అయినా నియామకాలు చేపట్టలేదని... ఇదంతా వృథా ప్రయాస అయిందని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.
ఖాళీల భర్తీకి సంబంధించి వివరాలను తదుపరి విచారణకు అందజేస్తామని మెహతా చెప్పడంతో ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని ధర్మాసనం పేర్కొంది. ‘‘మీపై మాకు విశ్వాసం ఉంది. ఇలాంటి చట్టాలు చేయమని ప్రభుత్వానికి ఎప్పుడూ సూచించరు . ప్రభుత్వం దగ్గర ఉండే కొందరు బ్యూరోక్రాట్లు సలహాలు ఇస్తారు. ఒకవేళ ఏదైనా తీర్పు వస్తే కొత్త చట్టం రూపొందించమని చెబుతారు. ప్రస్తుతం బ్యూరోక్రసీ పనితీరు ఇలా ఉంది. అది మాకు తెలుసు. కానీ సీరియస్ అంశం కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఏదిఏమైనప్పటికీ మేమెంతో నిరుత్సాహం చెందాం. మేం చెప్పదలచుకున్నది ఇదే’’ అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి సీజేఐ వ్యాఖ్యానించారు. మూడు నాలుగు రోజులపాటు సమయం ఇస్తే... ఈలోగా భర్తీ చేస్తామని తుషార్ మెహతా చెప్పడంతో సోమవారానికి విచారణ వాయిదా వేస్తున్నామని కోర్టు పేర్కొంది.
సోమవారానికి ఖాళీల భర్తీ కాకుంటే ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీకి పది రోజులు సమయం ఇస్తూ ధర్మాసనం ఆగస్టు 16న ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ట్రైబ్యునల్ సభ్యుల పదవీకాలం తగ్గించడం, ఇతర సేవలను తగ్గిస్తూ కేంద్రం తీసుకొచి్చన ట్రైబ్యునల్ సంస్కరణల చట్టం, 2021ను ఇటీవల పార్లమెంటు ఆమోదించిన విషయం తెలిసిందే. ట్రిబ్యునల్ సభ్యుడు లేదా చైర్‌పర్సన్ నియామకానికి కనీస వయసు 50 ఏళ్లు ఉండాలన్న నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, ట్రైబ్యునళ్ల చైర్‌పర్సన్ల పదవీకాలం ఐదేళ్లు ఉండాలని ఆ మేరకు చట్టంలో పొందుపరచాలని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇవే అంశాలు మళ్లీ కొత్త చట్టంలో రావడంతో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయా అంశాలు కేంద్రం విస్మరించడంతో తమ తీర్పులు పాటించడం లేదని అసహనం వ్యక్తం చేసింది. గతంలో కొట్టివేసిన చట్టానికి కొత్త చట్టం అచ్చు నకలులా ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment