న్యూఢిల్లీ: అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా అక్టోబరు 15 నుంచి సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు తెరిచేందుకు కేంద్రం వెసలుబాటు కల్పించినా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ఆ దిశగా అడుగులు పడటం లేదు. మరికొన్ని రాష్ట్రాలు ఇందుకు అంగీకరించినా.. యాభై శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్ల నిర్వహణ కష్టతరమంటూ ఎగ్జిబిటర్లు తేల్చిచెప్తున్నారు. మరోవైపు.. కరోనా లాక్‌డౌన్‌తో వాయిదాపడ్డ సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలను వెండితెర మీద ప్రదర్శించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. మరి, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ప్రేక్షకులు నిజంగానే థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలానుకుంటున్నారా? రానున్న రెండు నెలల్లో కొత్త సినిమాలు విడుదలైతే థియేటర్‌కు వెళ్లేందుకు ఎంత మంది సిద్ధంగా ఉన్నారు? అన్న అంశాలపై లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.(చదవండి: నవంబర్ 30 వరకూ అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్ అమలు)
థియేటర్‌కు వెళ్లే ప్రసక్తే లేదు!
ఈ ఆన్‌లైన్ సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 8274 మంది అభిప్రాయాలు సేకరించగా.. వారిలో కేవలం 7 శాతం మంది మాత్రమే థియేటర్లకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. వీరిలో 4 శాతం మంది కేవలం కొత్త సినిమా రిలీజ్ అయితే మాత్రమే వెళ్తామని చెప్పగా, 3 శాతం మంది.. కొత్త, పాత అనే తేడా లేకుండా థియేటర్‌లో ఏ సినిమా అయినా చూసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇక అత్యధికంగా 74 శాతం మంది మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా ఉండగా, 2 శాతం మంది కచ్చితమైన అభిప్రాయమేదీ వెల్లడించలేదని సర్వే పేర్కొంది. మిగిలిన 17 శాతం మంది మాత్రం థియేటర్‌లో సినిమా చూసే ఆలోచనే తమకు లేదని స్పష్టం చేసినట్లు తెలిపింది.
కాగా లోకల్‌సర్కిల్స్ జూలైలో నిర్వహించిన సర్వేలో, 72 శాతం మంది, ఆగష్టునాటి సర్వేలో 77 శాతం మంది ప్రస్తుత పరిస్థితుల్లో తాము థియేటర్లకు వెళ్లేందుకు ఏమాత్రం సిద్ధంగాలేమని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఓటీటీ ప్లాట్‌ఫాంలవైపే మొగ్గుచూపుతున్నారని వెల్లడైంది. వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రానందున ఇంట్లోనే కూర్చుని సినిమా చూసేందుకు ఇష్టపడతున్నట్లు పేర్కొంది. కాగా కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా, గత ఏడు నెలలుగా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో సినీరంగం కుదేలైంది. సినీ కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దీంతో కొంతమంది తాత్కాలిక ఉపాధి మార్గాల వైపు మళ్లగా, మరికొంత మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇక కంటైన్మెంట్ జోన్ల వెలుపల సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు 50 శాతం సీట్లతో అనుమతించడంతో సహా అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు నవంబర్ 30 వరకూ అమల్లో ఉంటాయని కేంద్రం మంగళవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ సహా ఈశాన్య రాష్ట్రాలు థియేటర్ల ఓపెనింగ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదిలా ఉంటే కర్ణాటక, గుజరాత్, బెంగాల్, యూపీ, బిహార్, ఢిల్లీ తదితర 14 రాష్ట్రాల్లో థియేటర్లు తెరచుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment