ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల కోసం గాలింపు కొనసాగుతోంది. వాటిని పట్టుకునేందుకు పోలీసులు, జిల్లా అటవీ శాఖ అధికారులు డ్రోన్లను ఉపయోగించి మరీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బహ్రైచ్ డివిజన్ సర్కిల్ అధికారి అభిషేక్ సింగ్ మాట్లాడుతూ డ్రోన్‌ల సాయంతో తోడేళ్ల జాడలు లభించాయన్నారు. జిల్లా అటవీశాఖ అధికారితో పాటు మొత్తం బృందమంతా సెర్చ్ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉందన్నారు. ఒకట్రెండు రోజుల్లో తోడేళ్లను పట్టుకుంటామన్నారు.
గత కొన్ని నెలలుగా బహ్రైచ్‌లో స్థానికులను తోడేళ్లు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నరమాంస భక్షక తోడేళ్లు ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 8 మందిని చంపాయి. అధికారులు ఇప్పటి వరకు నాలుగు తోడేళ్లను పట్టుకోగా, మరో రెండు తోడేళ్లను పట్టుకునేందుకు అన్వేషణ కొనసాగుతోంది. తోడేళ్లను రక్షించడానికి, పట్టుకోవడానికి పీఎసీకి చెందిన 200 బృందాలు, రెవెన్యూ శాఖకు చెందిన 32 బృందాలు, అటవీ శాఖకు చెందిన 25 బృందాలు రంగంలోకి దిగాయి.
మహసీ తహసీల్‌లోని హార్ది, ఖైరీఘాట్ పరిధిలోని దాదాపు 50 గ్రామాల ప్రజలు తోడేళ్ల భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తోడేళ్లను పట్టుకునేందుకు మూడు థర్మల్ డ్రోన్లు, నాలుగు కేజ్‌లు, నెట్, ఆరు ట్రాపింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. తాజాగా హార్ది పోలీస్ స్టేషన్ పరిధిలో తోడేలు మరోసారి దాడి చేసింది. ఇంట్లో తల్లితో కలిసి పడుకున్న ఏడేళ్ల చిన్నారిపై తోడేలు దాడి చేసింది. ఈ ఘటన మజ్రా జంగిల్ పూర్వా గ్రామంలో చోటుచేసుకుంది. ఇంట్లోకి చొరబడిన ఆ తోడేలు చిన్నారి మెడను నోటకరచుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా, ఆ చిన్నారి అరుపు విని కుటుంబ సభ్యులు నిద్ర నుంచి లేచారు. దీంతో ఆ తోడేలు పొలాల్లోకి పరుగెత్తింది.
Comments
Please login to add a commentAdd a comment