► ప్రశాంతంగా ముగిసిన తొలి దశ పోలింగ్
- పశ్చిమ బెంగాల్ 30, అసోంలో 47 స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
- తొలిదశ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది.
- సాయంత్రం 5 గంటల వరకు బెంగాల్‌లో 77.99 శాతం పోలింగ్ నమోదు
- అసోంలో సాయంత్రం 5 గంటల వరకు 71.62 శాతం పోలింగ్
► పశ్చిమ బెంగాల్, అసోంలో తొలిదశ ఎన్నికల పోలింగ్
- బెంగాల్‌లో 30, అసోంలో 47 అసెంబ్లీ స్థానాలకు తొలిదశలో ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది.
- ఈ క్రమంలో బెంగాల్‌లో సాయంత్రం 4 గంటల వరకు 70.17 శాతం పోలింగ్ నమోదైంది.
- అసోంలో సాయంత్రం 4 గంటల వరకు 62.36 శాతం పోలింగ్ నమోదు.
► సువేందు సోదరుడి కారుపై దాడి, ఒక కార్యకర్త హత్య
- పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని కేశియారి ప్రాంతంలో బీజేపీ కార్యకర్త మంగల్ సోరెన్ (35) దారుణ హత్యకు గురయ్యాడు.
- పుర్బా మేదినిపూర్ జిల్లా సత్సతామల్ నియోజకవర్గంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా ఇద్దరు భద్రతా సిబ్బంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
- కొంటై నియోజకవర్గంలోని బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి సోదరుడు సౌమెందు అధికారి కారుపై దాడి జరిగింది. అతడి కారును అడ్డగించి ధ్వంసం చేశారు. కారు డ్రైవర్‌పై దాడి చేశారు. అయితే ఈ దాడి నుంచి సౌమెందు అధికారి సురక్షితంగా బయటపడ్డాడు.
► బెంగాల్, అసోంలో రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిల్చున్నారు. ఎన్నికల అధికారులు పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. బెంగాల్‌లో ఉదయం 11 గంటల వరకు 24.61 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అసోంలో ఉదయం11 గంటల వరకు 24.48 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అసోంలోని డిబ్రుగఢ్‌లో సీఎం సర్వానంద సోనోవాల్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో వందకు పైగా సీట్లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
►బెంగాల్, అసోంలో తొలిదశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బెంగాల్‌లో ఉదయం 9 గంటల వరకు 7.72 శాతం పోలింగ్ నమోదు నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అసోంలో ఉదయం 9 గంటల వరకు 8.84 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఓటుర్లు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
►బెంగాల్‌లో 5 జిల్లాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు భారీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. తొలిదశలో బరిలో 191 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. తొలిదశలో 10,288 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.73.80 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.
►అసోంలో 12 జిల్లాల్లో 47 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు భారీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. తొలిదశలో బరిలో 264 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తొలి దశలో 11,537 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.50 శాతం పోలింగ్ కేంద్రాల్లో అధికారులు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 81.09 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలిదశలో మజూలి నుంచి బరిలో సీఎం సర్వానంద సోనోవాల్, జోర్హత్ నుంచి స్పీకర్ హితేంద్రనాథ్ బరిలో ఉన్నారు.
►పశ్చిమబెంగాల్‌లో తొలిదశ ఎన్నికల వేళ హింస చెలరేగింది. ఖేజురిలో బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగింది. పటాష్‌పూర్‌లో భద్రతా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. కోల్‌కతాలో 22 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
►పురులియాలో బస్సులో మంటలు చెలరేగాయి. ఎన్నికల సిబ్బందికి ఆహారం సరఫరా చేస్తున్న బస్సులో మంటలు ఎగిసిపడ్డాయి. బస్సులో మంటలు చెలరేగిన ఘటనపై విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.
కోల్‌కతా/గౌహటి: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పశ్చిమబెంగాల్‌తో పాటు అసోం అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బెంగాల్‌లో 30, అసోంలో 47 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు.
కోవిడ్–19 కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంది. ప్రతీ పోలింగ్ కేంద్రం దగ్గర థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. శానిటైజర్లు ఉంచారు. పరీక్షలో ఎవరికైనా జ్వరం ఉందని తేలితే వారిని సాయంత్రం ఓటు వేయడానికి అనుమతిస్తారు.
ఓటర్లందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి తీరాలన్న నిబంధనలున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు యంత్రాంగం పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. అస్పాం తొలిదశ ఎన్నికల పోలింగ్‌లో సీఎం సర్వానంద సోనోవాల్, స్పీకర్ హితేంద్రనాథ్ అదృష్టం పరీక్షించుకోనున్నారు.
బరిలో ఉన్న ప్రముఖులు
పశ్చిమబెంగాల్‌లోని 30 స్థానాల్లో కొందరి అభ్యర్థిత్వం ఆసక్తి రేపుతోంది. పురూలియా సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్ ముఖర్జీ ఇటీవల బీజేపీ గూటికి చేరుకొని ఎన్నికల బరిలో నిలిచారు. ఆయనపై టీఎంసీ మంత్రి శాంతి రామ్ మెహతా పోటీ పడుతున్నారు. ఖరగ్‌పూర్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొని ఉంది. దినేన్ రాయ్ (టీఎంసీ), తపన్ భూహియా (బీజేపీ), ఎస్.కె.సద్దామ్ అలీ (సీపీఐఎం) మధ్య గట్టి పోటీ ఉంది.
అస్సాంలో తొలి దశలోనే ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులు, ఎందరో విపక్ష నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్ మజూలి నుంచి తిరిగి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నేత రజీబ్ లోచన్ పెగు ఈ నియోజకవర్గం నుంచి 2001 నుంచి వరసగా మూడు సార్లు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో సోనోవాల్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ సారి మళ్లీ వీళ్లిద్దరే తలపడుతున్నారు. జోర్హత్ నుంచి అసెంబ్లీ స్పీకర్ హితేంద్రనాథ్ పోటీ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment