
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ఇటీవల ప్రధానమంత్రికి సమర్పించిన వినతి పత్రంలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలి. అడ్డుకునే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. పెగాసెస్ వ్యవహారం సామాన్య ప్రజలకు సంబంధించింది కాదు. ఎల్ఐసీ, బీపీసీఎల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం.
చదవండి: (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష; కీలక ఆదేశాలు)
కరోనా నేపథ్యంలో రాష్ట్రాలకు జీఎస్టీ నష్టపరిహారాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలి. మధ్యతరగతి ప్రజలకు స్వల్ప మొత్తంతో ఆరోగ్య భీమా వర్తింపజేయాలి. తక్షణమే జనాభా లెక్కల సేకరణ చేపట్టాలి. అందులో కులాల వారి గణన కూడా చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలలో 10 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. నిర్ణీత కాల వ్యవధిలో నియామకాలు పూర్తి చేసేలా యూపీఎస్సీ తరహాలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్‌ఆర్‌బీకి సైతం చట్ట బద్ధత కల్పించాలి' అని అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కోరారు.