● ఆరువారాలు దాటినా అందని ఇంటర్ మూల్యాంకనం డబ్బులు ● ని
మారిన ఇంటర్‌బోర్డు తీరు
గతంలో ఇంటర్ మూల్యాంకనం కోసం అయ్యే డబ్బులను ముందుగా ఇంటర్ నోడల్ అధికారి అకౌంట్‌లో ఇంటర్ బోర్డు వారు జమ చేసేవారు. ఇంటర్ నోడల్ అధికారి మూల్యాంకనం ముగిసిన వెంటనే అధ్యాపకుల రెమ్యునరేషన్ లెక్కించి వెంటనే ఖాతాల్లో వారంలోపే జమ చేసేవారు. కానీ.. గతేడాది నుంచి ఇంటర్ బోర్డు వారు నేరుగా అధ్యాపకుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడంతో ఇంటర్ నోడల్ అధికారి మూల్యాంకనం చేసిన అధ్యాపకుల వివరాలు ఇంటర్ బోర్డుకు అప్‌లోడ్ చేస్తున్నారు. కానీ.. బోర్డు వారు మాత్రం అధ్యాపకుల మూల్యాంకనం డబ్బులు ఇప్పటివరకు జమ చేయలేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి మూల్యాంకనం డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని విధులు నిర్వర్తించిన అధ్యాపకులు కోరుతున్నారు.
లక్ష్మణచాంద: జిల్లాలో ఇంటర్ పరీక్షల మూల్యాంకనం ముగిసి ఆరువారాలైనా అధ్యాపకులకు రె మ్యునరేషన్ డబ్బులు అందలేదు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం మూల్యాంకనం గత మార్చి 16నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగింది. ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. కానీ.. మూల్యాంకనం విధులు నిర్వర్తించిన అధ్యాపకులు రెమ్యునరేషన్ కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఇంటర్ మూల్యాంకనం నిర్వహించేవారు. నిర్మల్ జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ఇక్కడే జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలోనే ఇంటర్ మూల్యాంకనం నిర్వహిస్తున్నారు. జిల్లాలో 500 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు (ఏఈలు) పేపర్ వాల్యుయేషన్‌లో పాల్గొనగా, వీరికి రెమ్యునరేషన్ అందలేదు.
రెమ్యునరేషన్ ఇలా..
ఇంటర్ మూల్యాంకనం విధులకు హాజరైన ఏఈల కు ఒక్కో పేపర్ వాల్యుయేషన్ చేసినందుకు రూ. 23.66 ఇవ్వాల్సి ఉంటుంది. రోజుకు ఒక్కో ఏఈ 30 పేపర్లు వాల్యుయేషన్ చేస్తారు. అలాగే ఒక్కోరోజుకు డీఏ, 50కిలో మీటర్ల లోపు వారికి రూ.400, లోకల్ వారికి రూ.188, 50కిలోమీటర్ల పైన ఉన్నవారికి రూ.703 రెమ్యునరేషన్‌తోపాటు చెల్లిస్తారు.
గతంలో చివరిరోజే..
కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటర్ వాల్యుయేషన్ ప్రక్రియ నిర్వహించేవారు. గతంలో మూల్యాంకనం చివరిరోజే అధ్యాపకులకు పూర్తి రెమ్యునరేషన్ చెల్లించేవారు. నాలుగేళ్లుగా అధ్యాపకుల నుంచి బ్యాంక్ ఖాతాలు తీసుకుని వారంలోపు మూల్యాంకనం డబ్బులు జమ చేసేవారు. గతేడాది నుంచి మాత్రం రెమ్యునరేషన్ చెల్లింపులో విపరీతమైన జాప్యం చేస్తుండడంతో అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి జిల్లాకు రావాల్సిన రెమ్యునరేషన్ డబ్బులు రూ.90 లక్షలు నేటికీ అందలేదని అధ్యాపకులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment