ట్రబుల్ బూత్ నంబర్ 227
● దొందరిలో అష్టకష్టాల మధ్య పోలింగ్
ఖానాపూర్: నియోజకవర్గంలోని పెంబి మండలం మారుమూల గ్రామాలైన వస్‌పెల్లి, దొందరి గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అష్టకష్టాల మధ్య సాగింది. పెంబి మండల కేంద్రం నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని ఈ గిరిజన గ్రామాలకు కొసగుట్ట మీదుగా వెళ్తే చిక్‌మన్‌వాగు, కడెం వాగు, అటవీ ప్రాంతం ఉంటుంది. గుమ్మెన ఎంగ్లాపూర్ గ్రామం మీదుగా వెళ్లినా వాగులతో పాటు అడవి ఉంటుంది. గత 13వ తేదీన నిర్వహించిన ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించేందుకు అధికారులు ఉట్నూర్‌లోని రిసెప్షన్ నుంచి పోలింగ్ సామగ్రితో ప్రత్యేక వాహనంలో పెంబికి చేరుకున్నారు. అక్కడి నుంచి గతుకుల రోడ్డు మీదుగా దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా ఇటిక్యాల తండా, గుమ్మెనకు వెళ్లారు. అక్కడ రాత్రి వర్షం ప్రారంభం కాగా, వస్‌పల్లి వరకు ఫోర్ వీలర్‌ను తోసుకుంటూ వెళ్లారు. అక్కడ ఫోర్‌వీలర్ బురదలో దిగబడింది. రాత్రి 11గంటలకు భారీ వర్షంలోనూ నాలుగు కిలోమీటర్ల దూరంలోని దొందరికి కమ్యూనికేషన్ పోలీస్ అధికారులు, సిబ్బంది, సెక్టోరల్ అధికారులు, ఇతర సిబ్బంది ఎండ్లబండిపై రాత్రి 11.55కి చేరుకున్నారు. ఆ వెంటనే అధికారులకు రిపోర్టు చేయగా 13న పోలింగ్ ప్రక్రియ సాఫీగా జరిగింది. కలెక్టర్ కంట్రోల్ రూమ్‌తో పాటు రిటర్నింగ్ అధికారికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసేందుకు సిగ్నల్ కోసం గుమ్మెనలో టవర్ ఏర్పాటు చేశారు. రూట్ ఆఫీసర్ గంగజల, సెక్టోరియల్ ఆఫీసర్ బోజదాస్, ఐటీ అండ్ సీ (కమ్యూనికేషన్ పోలీస్ అధికారులు) ఎస్సై గంగాసాగర్, కానిస్టేబు ల్ రాజ్‌కుమార్ తదితరులు కమ్యూనికేట్ చేస్తూ అష్టకష్టాలు పడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గుమ్మెన గ్రామస్తులు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎన్నికలు బహిష్కరించి ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. వాగులు పొంగిపొర్లడంతో అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయగా, వారం తర్వాత మళ్లీ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment