కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు రానివ్వొద్దు
● రైతులు నష్టపోకుండా చూడాలి
● కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
● అధికారులతో సమీక్షా సమావేశం
నిర్మల్‌చైన్‌గేట్: అకాల వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ధాన్యం కొనుగోళ్లు, వర్షాలతో రైతులు నష్టపోకుండా తీసుకోవా ల్సిన చర్యలు, సీఎంఆర్ సరఫరా తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని, కేంద్రాల్లో టార్పాలిన్లు, క్లీనింగ్ మిషన్లు, గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలని, ఇందుకు అవసరమైన లారీలను సమకూర్చుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో కేంద్రాలను పర్యవేక్షించి రోజువారీ నివేదికలు అందించాలని తెలిపారు. విధులను నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సీఎంఆర్ సరఫరాపై మిల్లుల వారీగా చర్చించారు. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, డీఎస్వో నందిత, డీఎం సివిల్ సప్లయీస్ శ్రీకళ, డీసీవో నర్సయ్య, డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్, మార్కెటింగ్ ఏడీ అశ్వాక్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment