ఖలీల్‌వాడి : కన్న కొడుకును హత్య చేసిన మహిళకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి టి శ్రీనివాస్ గురువారం తీర్పు ఇచ్చారు. వివరాలు.. నగరంలోని సంతోష్‌నగర్‌కు చెందిన గడ్డం భరత్‌కు సదాశివనగర్ మండలం తిర్మన్‌పల్లి గ్రామానికి చెందిన లావణ్యతో వివాహం అయింది. లావణ్యకు కల్లు తాగే అలవాటు ఉండేది. అలవాటు మానుకోవాలని భర్త ఎన్నోసార్లు హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగేది. ఈ క్రమంలో భర్తపై కసి పెంచుకుంది. ఓ రోజు నిద్రపోతున్న భరత్‌పై బ్లేడ్‌తో దాడి చేసింది. భర్తపై కోపంతో 2023 మార్చి 29న తన ఆరేళ్ల కుమారుడిని కాలువలో ముంచి హత్య చేసింది. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి నిందితురాలికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా వి ధించారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా నెల రోజుల జైలుశిక్ష అనుభవించాలని పేర్కొన్నారు.
కార్మికురాలిని ఢీకొట్టిన ఆటో డ్రైవర్‌కు..
ఖలీల్‌వాడి : మున్సిపల్ కార్మికురాలిని ఢీకొట్టిన ఆటో డ్రైవర్‌కు రెండు రోజుల జైలు శిక్ష పడినట్లు నాలుగో టౌన్ ఎస్సై ఉదయ్ కుమార్ గురువారం తెలిపారు. నగరంలోని బ్యాంక్ కాలనీలో మున్సిపల్ కార్మికురాలు నిమ్మరాజు సాయమ్మ విధులు నిర్వహిస్తుండగా ఆటోనగర్‌కు చెందిన అబ్దుల్ మాజిద్ మద్యం మత్తులో ఆటోతో ఆమెను ఢీకొన్నాడు. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ నిందితుడికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment