
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి.
వాషింగ్టన్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. తానా ఎన్నికల్లో నిరంజన్ ప్యానెల్ గెలుపొందింది. దీంతో శృంగవరపు నిరంజన్ తానా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి నరేన్ కొడాలిపై ఆయన విజయం సాధించారు. నిరంజన్ ప్యానెల్‌కు 10,866 ఓట్లు రాగా, నరేన్ కొడాలి ప్యానెల్‌కు 9,108 ఓట్లు దక్కాయి. కర్నూలు వాసి నిరంజన్ ప్రస్తుతం అమెరికాలోని మిషిగన్‌లో నివసిస్తున్నారు.
తానా తదుపరి అధ్యక్షుడిగా నిరంజన్ శృంగవరపు ఎన్నికవడం చాలా ఆనందంగా ఉందని ప్రస్తుత అధ్యక్షుడు జై తాళ్లూరి తెలపారు. టీం నిరంజన్ ప్యానల్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు జై తాళ్లూరి ఓ వీడియో ద్వారా తన సందేశాన్ని విడుదల చేశారు. తానాలో గెలుపోటములు ఉండవని.. బరిలో దిగిన ప్రతి వాళ్లూ గెలిచినట్టేనని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో పాల్గొన్నందుకు నరేన్ కొడాలి టీంకు ఆయన అభినందనలు చెప్పారు. తానా అభ్యున్నతకి అందరూ కలిసి పనిచేస్తారని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
చదవండి: భారత సంతతి కుటుంబం నిజాయతీ.. రూ.7 కోట్లు తిరిగిచ్చేసింది