సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న నాయీబ్రాహ్మణ జేఏసీ నాయకులు
పెనుగంచిప్రోలు: దేవాలయ కల్యాణకట్ట క్షురకులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ జీఓ ఇచ్చి, మంత్రి మండలిలో ఆమోదించటం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయమని నాయీబ్రాహ్మణుల రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు గుంటుపల్లి రామదాసు అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా బుధవారం స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయ కల్యాణకట్టలో పనిచేసే నాయీ బ్రాహ్మణులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. అమ్మవారికి మొక్కలు చెల్లించారు. కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయ పాలక వర్గాల్లో నాయీబ్రాహ్మణులకు సభ్యులుగా అవకాశం కల్పించటంతో పాటు, నెలకు కనీస వేతనం రూ.20 వేలు కమిషన్ అందించాలని తీసుకున్న నిర్ణయం జీవితాంతం మర్చిపోలేమన్నారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌వీ రమణ, కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, కోశాధికారి ఏజీఎల్ నారాయణ, సభ్యులు కొలిపాక కృష్ణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment