సహకార వారోత్సవాలను జయప్రదం చేద్దాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సుస్థిర అభివృద్ధి, లక్ష్యాల సాధనలో సహకార సంస్థల పాత్ర కీలక మని ఎన్టీఆర్ ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ నిధిమీనా పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి జరిగే సహకార వారోత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. కలెక్టరేట్‌లో 71వ అఖిల భారత సహకార వారోత్సవాల వాల్ పోస్టర్లను ఆమె మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిధి మీనా మాట్లాడుతూ.. సుస్థర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సహకార సంఘాలు ఎంతో దోహదపడతాయన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకార్ సే సమృద్ధి యోజన ద్వారా ఇప్పటికే పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి జన ఔషధి ద్వారా జిల్లాలో ఐదు జనరిక్ మందుల కేంద్రాలను ప్రారంభించారని తెలిపారు. మూడు పెట్రోల్ బంకులతోపాటు నిర్వహణను సహకార సంఘాలకు అప్పగించారని పేర్కొన్నారు. వారోత్సవాలలో భాగంగా 14న సహకార శాఖ అమలు చేసే నూతన కార్యక్రమాల గురించి వివరించడం, 15న నూతన అవిష్కరణలు, సాంకేతికత సుపరిపాలన, 16న తేదీన వ్యవస్థాపకత, ఉపాధి కల్పన, నైపుణాభివృద్ధిలో సహకార సంఘాల పాత్ర, 17న సహకార సంస్థల వ్యాపార ప్రాయోజిత సంస్థలుగా రూపాంతరం, 18న సహకార సంఘాల మధ్య సహకారాన్ని పెంపొందించడం, 19న మహిళలు, యువత, బలహీనవర్గాలకు సహకారంలో సహకార సంఘాల పాత్ర, 20న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో సహకార సంఘాల పాత్ర వంటి అంశాలపై అవగాహన కల్పించి సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలని నిధి మీనా సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆపరేటివ్ అధికారి డాక్టర్ ఎస్.శ్రీనివాసరెడ్డి, జిల్లా కోఆపరేటివ్ ఆడిట్ ఆఫీసర్ సీహెచ్.శైలజ, డివిజనల్ కోఆపరేటివ్ అధికారి పి.కిరణ్ కుమార్, డెప్యూటీ రిజిస్ట్రార్ ఎస్.కేశవ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధిమీనా
Comments
Please login to add a commentAdd a comment