సోలార్ ఎనర్జీని వినియోగించుకోండి
ఇబ్రహీంపట్నం: సోలార్ రూఫ్ టాప్ ఎనర్జీని గ్రామీణ స్థాయిలో సైతం వినియోగించుకుని విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని విద్యుత్ శాఖ విజయవాడ సర్కిల్ ఎస్‌ఈ ఎ.మురళీమోహన్ తెలిపారు. ఇబ్రహీంపట్నం ముత్తవరపు కల్యాణ మండపంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. విజయవాడ రూరల్ డివిజన్ పరిధిలోని మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లోని విద్యుత్ ఉద్యోగులు, వినియోగదారులకు సోలార్ ఎనర్జీ ఏర్పాటు, వినియోగం, నూతన కనెక్షన్‌ల రిజిస్టేషన్లపై ఆయన అవగాహన కల్పించారు. సోలార్ ప్లేట్ల ఏర్పాటు, వినియోగంపై గ్రామీణ ప్రాంత విద్యుత్ వినియోగదారులకు సైతం చేరువ చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1, 2, 3 కిలోవాట్లకు అవసరమైన సోలార్ ఎనర్జీ ప్లేటు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కనెక్షన్ పొందేందుకు సబ్సిడీతో పాటు బ్యాంక్ రుణాలు ఇస్తాయన్నారు. ఆయా నియోజకవర్గాల్లో మండలాల వారీగా ఈ ఏడాది సాధించాల్సిన లక్ష్యాలను ఈఈ వసంతరావు తెలియజేశారు. మండలాల వారీగా రిజిస్టేషన్లు పూర్తి చేసేందుకు ఉద్యోగులతో టీమ్‌లు ఏర్పాటు చేశారు. అనంతరం పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈఈలు వసంతరావు, హనుమయ్య, డీఈఈలు కె.కొండలరావు, ఐ.సుధాకరరావు, జె.శ్రీనివాసరావు, వివిధ మండలాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment