మంత్రముగ్దులను చేసిన తీర్థతరంగాలు | Sakshi
Sakshi News home page

మంత్రముగ్దులను చేసిన తీర్థతరంగాలు

Published Thu, Apr 18 2024 11:50 AM

- - Sakshi

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా బుధవారం ధర్మపథం వేదికపై కృష్ణ సంపత్‌కుమార్‌ బృందం ఆలపించిన నారాయణ తీర్థతరంగాలు భక్తులను మంత్ర ముగ్ధులను చేశాయి. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం ధర్మపథం వేదికపై సంపత్‌కుమార్‌ పలు కీర్తనలను మనోహరంగా అలపించారు. సంపత్‌కుమార్‌కు పాలవర్తి నాగేశ్వరరావు వయోలిన్‌, డి.అనిల్‌కుమార్‌ మృదంగంపై సహకారం అందించారు. అంతకు ముందు సంపత్‌కుమార్‌ బృందానికి ఆలయ ఈవో కె.ఎస్‌.రామరావు అమ్మవారి శే షవస్త్రాలు, ప్రసాదాలను ఇచ్చి సత్కరించారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి ఇండస్ట్రియల్‌ ఏరియాలోని ఓ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం పెడన మండలం గాయంపాడు గ్రామ వాసి అర్జా పవన్‌(27) ఐడీఏలోని ఓ లాడ్జిలోని రూమ్‌లో అద్దెకు ఉంటూ రాణి లైఫ్‌ సైన్సెస్‌ కెమికల్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. లాడ్జి గదిలో పవన్‌ బోర్లా పడుకుని మృతి చెంది ఉండటాన్ని సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుని తండ్రి అర్జా రాంబాబు ఫిర్యాదుపై మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్‌ఐ పాపారావు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐ తెలిపారు.

చిన్నారిపై లైంగికదాడి

పోక్సో కేసు నమోదు

కంకిపాడు: చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డ యువకుడిపై కంకిపాడు పోలీసుస్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఎస్‌ఐ సందీప్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కంకిపాడుకు చెందిన వంగా ప్రవీణ్‌ క్లీనర్‌గా చేసి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. గతంలో అతని ఇంటి సమీపంలో ఉండే కుటుంటంతో సన్నిహితంగా మెలిగేవాడు. ప్రస్తుతం ఆ బాలిక కుటుంబం వేరే చోట ఉంటోంది. ఆ కుటుంబం ఉంటున్న ప్రాంతానికి మంగళవారం రాత్రి వచ్చి బాలిక (5)పై అత్యాచారయత్నం చేశాడు. బాలిక కుటుంబ సభ్యులు వెంటనే గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై లైంగికదాడికి పాల్పడ్డ నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement