
‘ఈ–శ్రమ్’లో వివరాలు నమోదు చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులతో పాటు ఓలా, బ్లింకిట్, స్వీగ్గి, జోమోటో వంటి అన్‌లైన్ ప్లాట్ ఫాం కార్మికులు ఈ–శ్రమ్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకునేందుకు ఈ నెల 17వ తేదీ వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ శిబిరాలపై కార్మిక శాఖ రూపొందించిన అవగాహన పోస్టర్లను కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ సోమవారం ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అసంఘటిత రంగాల కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ పథకాలను చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ–శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించిందన్నారు. ఆన్‌లైన్ ప్లాట్ ఫాం కార్మికులు, గిగ్ కార్మికులు ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం ద్వారా ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన ఆరోగ్య పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల వ్యాప్తంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక నమోదు శిబిరాలలో సంబంధిత కార్మికులు తప్పనిసరిగా పాల్గొని పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పోర్టల్ నమోదులో కార్మికులకు ఎదురయ్యే ఇబ్బందులు, సలహాలు, సూచనలు, ఇతర వివరాలకు జిల్లా కార్మిక శాఖ కార్యాలయంలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, డీఆర్‌డీఏ పీడీ నాంచారయ్య, ఉపకార్మిక కమిషనర్ సీహెచ్.ఆషారాణి, నగర పాలక సంస్థ యూసీడీపీఓ వెంకట నారాయణ పాల్గొన్నారు.
17వ తేదీ వరకు ప్రత్యేక నమోదు శిబిరాలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ