మళ్లీ బీజేడీదే అధికారం | Sakshi
Sakshi News home page

మళ్లీ బీజేడీదే అధికారం

Published Wed, May 8 2024 7:15 AM

మళ్లీ బీజేడీదే అధికారం

మంత్రి అతాన్‌ సవ్యసాచి నాయక్‌

రాయగడ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈసారి కూడా రాష్ట్రంలో బీజేడీ పార్టీ అధికారంలోకి రానుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, రాయగడ జిల్లా ఎన్నికల పరిశీలకులు అతాన్‌ సవ్యసాచి నాయక్‌ జోష్యం చెప్పారు. స్థానిక బీజేడీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతిచోటా ప్రజాదారణతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యంగా రాయగడ జిల్లాలో గల గుణుపూర్‌, రాయగడ, బిసంకటక్‌ శాసనసభలతోపాటు కొరాపుట్‌ లోక్‌సభ స్థానాల్లో కూడా తమ పార్టీ అభ్యర్థులు అధిక మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ప్రజలు మెచ్చిన పథకాలు .

ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు ప్రజలు మెచ్చినవి కావడంతో బీజేడీ పాలనపై నమ్మకం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రజల బాగోగులతో పాటు వారికి సుస్థిర పాలనను అందించే ఏకై క పార్టీగా బీజేడీ ఆవిర్భవించిందన్నారు. సంక్షేమ పథకాలే పార్టీ విజయానికి నాంది పలుకుతున్నాయన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ధికి అమలు చేసిన మిషన్‌ శక్తి, స్వయం సహాయక బృందాలు, మమత తదితర పథకాలు విజయవంతం కావడంతో బీజేడీకి ఆదరణ పెరిగిందన్నారు. దానికి అనుగుణంగా వారికి అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తుండటం పార్టీ అభివృద్ధికి మరో మైలు రాయిగా నిలిచిందన్నారు.

విభేదాలు లేవు..

పార్టీలో ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవని, అందరూ కలిసి పార్టీ విజయానికి కృషి చేస్తున్నారని ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. జిల్లాలో నెక్కంటి భాస్కరరావు, కృష్ణ మహాపాత్రో వంటి సీనియర్‌ నాయకులు పార్టీ విజయానికి నిరంతరం పని చేస్తున్నారన్నారు. వారి నాయకత్వంలో పార్టీ మరింత అభివృద్ధి చెందిందని కొనియాడారు. ఈ సమావేశంలొ రాయగడ శాసనసభ నియోజకవర్గం నుంచి పొటీ చేస్తున్న అనసూయా మాఝి, బీజేడీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు జగదీష్‌ పాత్రో తదితరులు పాల్గొన్నారు. .

Advertisement
 
Advertisement
 
Advertisement