వరుసగా రెండు పారాలింపిక్స్‌లో రజత పతకాలు సాధించిన భారత పారా షట్లర్ సుహాస్ యతిరాజ్... విశ్వక్రీడల్లో స్వర్ణం గెలవలేకపోవడం నిరాశగా ఉందని అన్నారు. పారిస్ పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్4 ఫైనల్లో పరాజయం పాలై రజతం దక్కించుకున్న 41 ఏళ్ల ఐఏఎస్ అధికారి సుహాస్ యతిరాజ్... మూడేళ్ల క్రితం టోక్యోలోనూ రెండో స్థానంలోనే నిలిచారు.
‘పసిడి పతకం సాధించాలని ఎంతో శ్రమించా. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌తో విశ్వ క్రీడలకు రావడంతో అంచనాల భారం కూడా పెరిగింది. రజతం దక్కడం కూడా ఆనందంగానే ఉన్నా... ఏదో వెలితి అనిపిస్తోంది. బంగారు పతకం చేజారిందనే బాధ ఒకవైపు... పారాలింపిక్స్ వంటి అత్యుత్తమ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ పతకం నెగ్గాననే భావన మరో వైపు ఉంది. గత కొంతకాలంగా దేశంలో క్రీడా సంస్కృతి పెరిగింది.
గతంలో క్రికెట్‌కే ఎక్కువ క్రేజ్ ఉండేది. ఇప్పుడు అన్ని క్రీడలకు ఆదరణ దక్కుతోంది. పారా అథ్లెట్లకు కూడా మంచి తోడ్పాటు లభిస్తోంది. రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో మనవాళ్లు మరిన్ని పతకాలు సాధించగలరు’ అని సుహాస్ అన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాకు చెందిన సుహాస్ 2007 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం సుహాస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ప్రాంతీయ రక్షక్ దళ్, యూత్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో సెక్రటరీ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment