పిక్నిక్ స్పాట్స్‌పై నిఘా
విజయనగరం క్రైమ్: కార్తీక మాసం వారాంతం సందర్భంగా విహార యాత్రలు, పిక్నిక్‌లకు ఎక్కువ మంది ప్రజలు వెళ్లే అవకాశం ఉన్నందున, ఆయా ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో పాటు, ముందస్తుగా నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విహార యాత్రలు నిర్వహించే ప్రాంతాలు, పిక్నిక్ స్పాట్స్ వద్దకు వచ్చే మహిళలు, యువతులు, ఈవ్‌టీజింగ్‌కు, వేధింపులకు గురికాకుండా మహిళల భద్రతకు సంబంధిత అధికారులు భద్రత ఏర్పాట్లు చేపట్టడంతో పాటు, డే బీట్లు, బందోబస్తు , మహిళా బీట్లను ఏర్పాటు చేసి, ఎటువంటి అల్లర్లు జరగకుండా చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. పిక్నిక్ పేరుతో అసాంఘిక కార్యకలాపాల నిర్వహణకు తావులేకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి, పేకాట , జూదం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం వంటి కార్యకలాపాలు జరగకుండా నిర్వాహకులతో ముందుగా సమావేశమై, అసాంఘిక కార్యకలాపాలు, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరడం, సత్ఫలితాలనిచ్చిందన్నారు. భద్రత ఏర్పాట్లను విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాసరావు, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు పర్యవేక్షించగా, సంబంధిత సీఐలు, ఎస్‌ఐలు భద్రతాచర్యలు చేపట్టారని వివరించారు.
పూరిల్లు దగ్ధం
మెంటాడ: మండలంలోని చింతలవలసలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో గ్రామానికి చెందిన ముచ్చర్ల కోటేశ్వరరావు పూరిల్లు కాలిపోయింది. కోటేశ్వరరావు అతని భార్య ఉదయాన్నే దేవుడి మూలన దీపం పెట్టి పక్కనే ఉన్న పిట్టాడ గ్రామంలో వ్యవసాయ కూలీ పనులకోసం వెళ్లారు. వారు వెళ్లిన కాసేపటికి ఇంటినుంచి పొగలు రావడం గమనించిన సర్పంచ్ కలిశెట్టి సూర్యనారాయణ తక్షణమే స్పందించి చుట్టుపక్కల ప్రజలతో కలిసి ఆర్పేప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. దీపం అంటుకుని ఇల్లు కాలినటు్‌ల్ స్థానికులు చెబుతున్నారు. ఇంట్లో ఉన్న బట్టలు, రూ.25 వేలు, పావుతులం బంగారం, ఇంట్లోని సామగ్రి, తిండి గింజలు మొత్తం కాలిపోయాయని బాధిత కోటేశ్వరరావు దంపతులు లబోదిబోమంటున్నారు. సుమారు లక్షరూపాయలు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. సమాచారం మేరకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సుధారాణి, వీఆర్‌ఓ కొండమ్మ వచ్చి కాలిపోయిన ఇంటిని పరిశీలించారు.
పోలీసుల అదుపులో పేకాటరాయళ్లు
నెల్లిమర్ల రూరల్: మండలంలోని సారిపల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై ఎస్సై బి.గణేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి దగ్గర ఉన్న రూ.13,150 నగదు సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం కోర్టుకు అప్పగించారు. బహిరంగ ప్రదేశాల్లో జూదం ఆడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. గ్రామాల్లో కోడిపందాలు, పేకాట, ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఫోన్ 9121109444 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
1400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
సాలూరు రూరల్: మండలంలోని సారిక, నేరళ్లవలస గ్రామాల మధ్యలో నిర్వహిస్తున్న సారా తయారీ కేంద్రాలపై రూరల్ ఎస్సై నరసింహ మూర్తి సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం దాడి చేసి 1400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. తయారీ కేంద్రం వద్ద నేరెళ్లవలసకు చెందిన డిప్ప చిన్నయ్యను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలి పారు. అలాగే 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దాడిలో కానిస్టేబుల్స్ శివశంకర్, గొర్లె గోపి, రాబాబు, సురేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment