బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌.. | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌..

Published Mon, May 6 2024 6:20 AM

బీఆర్

జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్‌ వద్ద ఆదివారం రాత్రి నిర్వహించిన కేసీఆర్‌ బస్సుయాత్ర బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. సాయంత్రం ఆరు గంటలకు కేసీఆర్‌ రోడ్‌షో నిర్వహించాల్సి ఉన్నా.. జగిత్యాలకు చేరుకునే సరికి రాత్రి 7.50 గంటలైంది. బస్సుయాత్రలో కేసీఆర్‌తోపాటు నిజామాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ వచ్చారు. కొత్తబస్టాండ్‌ వద్ద జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్‌, కల్వకుంట్ల సంజయ్‌, ఎమ్మెల్సీ రమణ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు ఘనస్వాగతం పలికారు. కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ.. ఒగ్గు కళాకారుల నృత్యాలతో టపాసుల మధ్య యాత్ర కొనసాగింది. కొత్తబస్టాండ్‌ నుంచి మొదలై అంగడిబజార్‌, తహసీల్‌చౌరస్తా మీదుగా బస్సు యాత్ర నిర్వహించి అక్కడ ప్రసంగించారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో యాత్ర బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. కేసీఆర్‌ 20 నిమిషాల పాటు ప్రసంగించారు.

వడ్లకుప్పలు ఎక్కడికక్కడే..

దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు అమలు చేశామని, రైతులు సమృద్ధిగా పంటలు పండించుకున్నారని కేసీఆర్‌ పేర్కొన్నారు. జగిత్యాలలో వడ్లకుప్పలు ఎక్కడికక్కడే ఉన్నాయన్నారు. ఆరెకరాలు, ఏడెకరాలున్న రైతులు ఏం పాపం చేశారని, వారికి రైతుబంధు ఎందుకు వేయలేదన్నారు. రూ.500 బోనస్‌ బోగస్‌ అయిందన్నారు. కల్యాణలక్ష్మి, తులం బంగారం కూడా లేదన్నారు. జగిత్యాలలో రెండురెండు తులాలు వచ్చిందంట కదా..? అనడంతో ప్రజలు బిగ్గరగా నవ్వారు.

అందని తాగునీరు

మిషన్‌ భగీరథ ద్వారా నీరు అందించామని, ఇప్పుడు ఎందుకు రావడం లేదని కేసీఆర్‌ ప్రశ్నించారు. కరెంట్‌ కోతలు పెడుతున్నది ఈ అసమర్థత ప్రభుత్వమన్నారు. పేదల ఇళ్లలో నల్లాలు పెట్టి గోదావరి నీరు ఇస్తే ఇప్పుడేం రోగం వచ్చిందని ప్రశ్నించారు. కొత్త స్కీంలు అమలు కావడం లేదని, పాతస్కీంలు బందయ్యాయని ఆరోపించారు. నిజామాబాద్‌ ఎంపీగా అర్వింద్‌ గెలిచి పసుపుబోర్డు తెచ్చారా..? షుగర్‌ ఫ్యాక్టరీ తెరిచారా..? అని ప్రశ్నించారు. యువత ఆలోచన చేసి ఓటేయాలని, తెలంగాణ భవిష్యత్‌ వారి చేతుల్లోనే ఉందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలిస్తేనే పార్లమెంట్‌లో కొట్లాడతారన్నారు. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీ ముందు మాట్లాడలేరన్నారు. జిల్లా రచయితలకు నిలయమని, ఇక్కడ చరిత్రకారుడు రమణయ్య వంటి మేధావులు ఉన్నారని, వారు ఆలోచన చేయాలని పేర్కొన్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలోని బీడీ కార్మికులను ఆదుకున్నది బీఆర్‌ఎస్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ గెలుపులోనే తెలంగాణ విజయం ఉందన్నారు. కేసీఆర్‌ గుండె చీల్చితే తెలంగాణ ఉంటదని, బతికున్నంత వరకూ తెలంగాణ కోసమే పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.

జగిత్యాలలో కేసీఆర్‌ రోడ్‌షో విజయవంతం

తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు

స్వాగతం పలికిన నాయకులు

ఆరుగ్యారంటీల అమలెక్కడ?

కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల్లో ఒక్కటీ అమలు చేయలేదని కేసీఆర్‌ అన్నారు. మహిళలకు రూ.2500 వచ్చాయా..? అని మహిళలను ప్రశ్నించారు. నిర్మల్‌ సభలో రాహుల్‌ గాంధీ రూ.2,500 ఇస్తున్నామని జూటామాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం ఏ ఊరికెళ్తే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టుకుంట ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.

బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌..
1/1

బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌..

Advertisement
 

తప్పక చదవండి

Advertisement