
మంచి రోజు కావడంతో నామినేషన్లు వేసిన ఎంపీ ఆభ్యర్థులు
లోక్‌సభ ఎన్నికల కోసం రెండు రోజుల్లో 117 సెట్ల నామినేషన్లు దాఖలు
భారీ ర్యాలీలు, హంగూ ఆర్భాటాలతో అభ్యర్థుల బల ప్రదర్శనలు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నామినేషన్లు శుక్రవారం ఊపందుకున్నాయి. ఏకాదశి మంచిరోజు కావడంతో ప్రధాన పార్టీల నుంచి కీలక నేతలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. మొత్తంగా రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకుగాను.. రెండో రోజున 57 మంది అభ్యర్థులు 69 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందించారు. తొలిరోజున 42 మంది అభ్యర్థులు వేసిన 48 సెట్ల నామినేషన్లు కలిపి.. మొత్తంగా 117 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.
భారీ ర్యాలీలు, బల ప్రదర్శనతో..: నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరించి భారీ ర్యాలీలు నిర్వహించారు. హంగూ ఆర్భాటాలతో బల ప్రదర్శన చేశారు. దీంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయానికి వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి.
సికింద్రాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఖమ్మంలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు నామినేషన్లు వేశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ కార్యక్రమాల్లో పాల్గొని, అనంతరం నిర్వహించిన సభల్లో మాట్లాడారు. సికింద్రాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పద్మారావుగౌడ్ నామినేషన్ వేశారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
పలువురు సీనియర్ల నామినేషన్లు..: శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసిన వారిలో కాంగ్రెస్ నుంచి పోరిక బలరాం నాయక్ (మహబూబాబాద్), గడ్డం వంశీ (పెద్దపల్లి), చల్లా వంశీచంద్‌రెడ్డి (మహబూబ్‌నగర్) ఆత్రం సుగుణ (ఆదిలాబాద్) ఉన్నారు. బీఆర్‌ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ (పెద్దపల్లి), బాజిరెడ్డి గోవర్ధన్ (నిజామాబాద్), మన్నె శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్), ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ (నాగర్ కర్నూల్).. బీజేపీ తరఫున బూర నర్సయ్యగౌడ్ (భువనగిరి), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్).. సీపీఎం నుంచి ఎండీ జహంగీర్ (భువనగిరి) నామినేషన్లు వేశారు.
పలు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలతో పాటు బీఎస్పీ, ధర్మ సమాజ్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలు కాకుండా.. భువనగిరి నుంచి ఇద్దరు, మహబూబాబాద్‌లో ఐదుగురు, నల్గొండలో నలుగురు, పెద్దపల్లిలో ముగ్గురు, మహబూబ్‌నగర్‌లో ఐదుగురు, వరంగల్‌లో ముగ్గురు, నిజామాబాద్‌లో ఆరుగురు చొప్పున నామినేషన్లు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment