బీజేపీ మాయలో పడొద్దు..: రేవంత్‌రెడ్డి | CM Revanth Reddy Fires On BJP | Sakshi
Sakshi News home page

బీజేపీ మాయలో పడొద్దు..: రేవంత్‌రెడ్డి

Published Sun, May 12 2024 5:01 AM | Last Updated on Sun, May 12 2024 5:01 AM

పటాన్‌చెరు రోడ్‌ షోలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.  చిత్రంలో దామోదర రాజనర్సింహ, మెదక్‌ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌

పటాన్‌చెరు రోడ్‌ షోలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో దామోదర రాజనర్సింహ, మెదక్‌ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌

మతపిచ్చి లేపి.. ఓట్లు దండుకోవాలని చూస్తోంది.. 

కేంద్రంలో ఆ పార్టీకి అధికారమిస్తే రిజర్వేషన్లు రద్దవుతాయి 

రాజ్యాంగాన్ని మార్చేస్తారు 

పటాన్‌చెరు రోడ్‌షోలో సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దేశంలోని ప్రజల్లో మతపిచ్చి లేపి.. ప్రజలు కత్తులతో పొడుచుకుని, గొంతులు తెగి రక్తం చిందిస్తుంటే బీజేపీ అందులోంచి ఓట్లు దండుకోవాలని చూస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. మతాలు, ప్రాంతాలు, భాషల మధ్య చిచ్చు పెట్టడం దేశానికి ఏ మాత్రం మంచిది కాదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ మాయలో పడి అధికారాన్ని కట్టబెడితే, అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తుందని విమర్శించారు. ఆ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. 

శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ రోడ్‌షోలో సీఎం రేవంత్‌ మాట్లాడారు. రిజర్వేషన్లు రద్దయితే బడుగు, బలహీన వర్గాలు ఐపీఎస్, ఐఏఎస్‌లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఎమ్మెల్యేలుగా పదవులు పొందే అవకాశం లేకుండా పోతుందన్నారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికలు అభివృద్ధి, సంక్షేమం ప్రాతిపదికన జరిగితే.. ఈ ఎన్నికలు రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం మార్చాలనే ప్రాతిపదికన జరుగుతున్నాయని, దీనిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.  

మోదీ, అమిత్‌షాలు ఏం తెచ్చారు? 
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలు రాష్ట్రానికి వస్తే తెలంగాణకు నిధులు తెస్తారని తాము అనుకున్నామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు, పటాన్‌చెరు వరకు మెట్రో పొడిగింపు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ పరిశ్రమల కోసం నిధులు ఇస్తారని అనుకున్నామని, కానీ బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి నిధులు రావాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రశాంత వాతావరణం, శాంతిభద్రతలు ఉన్నప్పుడే ఏ ప్రాంతమైనా అభివృద్ధి జరుగుతుందని, కులాలు, మతాల పేరుతో కొట్లాడుకుంటే పరిశ్రమలు, ప్రాజెక్టులు రావని అన్నారు.  

కుర్చీ మీద కుర్చీ వేస్తారా? 
బీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డిని ప్రకటించడంపై రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వెంకట్రామిరెడ్డికి మల్లన్నసాగర్‌ నిర్వాసితులను పోలీసుల బూట్లతో తొక్కించిన చరిత్ర ఉందని అన్నారు. కేసీఆర్, హరీశ్‌రావులకు రూ.వంద కోట్లు ఇచ్చినందుకే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామ్‌రెడ్డికి ఎంపీ టికెట్‌ ఇచ్చారన్నారు. ఎవరైనా కుర్చీ మీద.. కుర్చీ వేస్తారా అని ప్రశ్నించారు. పెగ్గు మీద పెగ్గు వేసినట్లు.. ఎమ్మెల్సీ ఉండగానే వెంకట్రామిరెడ్డికి ఎంపీ టికెట్టు ఇచ్చారని, పెగ్గులు వేసినప్పుడు టికెట్‌ ఇచ్చారో.. దిగేటప్పుడు ఇచ్చారో తెలియదని ఎద్దేవా చేశారు. 

వెంకట్రామిరెడ్డి తెల్లాపూర్‌లో వందల ఎకరాల భూములు కబ్జా చేసి, ఆస్తులు కూడగట్టుకున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి ఓడితే ఆయన అక్రమంగా సంపాదించిన నాలుగైదు వందల కోట్లు పోతాయే తప్ప ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ఇందిర, వైఎస్‌ హయాంలోనే అభివృద్ధి 
మెదక్‌ జిల్లాలో బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్, ఇక్రిశాట్‌ వంటి సంస్థలు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో వస్తే.. ఔటర్, శంషాబాద్‌ విమానాశ్రయం వంటి సంస్థలు దివంగత సీఎం వైఎస్‌ హయాంలో వచ్చాయని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఆయా సంస్థలు, పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులుగా పనిచేస్తున్నారని, ఈ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయని పేర్కొన్నారు. 

పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతం వివిధ రాష్ట్రాలు, కులాలు, మతాల ప్రజలతో మినీ ఇండియాగా విలసిల్లుతోందన్నారు. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కేసు సుప్రీం కోర్టు విచారణలో ఉందని, ఈ కేసును పర్యవేక్షిస్తున్నది మంత్రి దామోదర రాజనర్సింహ అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement