ఒక్కోసారి రాజకీయ నేతలు హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన చర్యలు వైరల్ అవుతుంటాయి. తమ నేత తోపు, తురుము అని అనుచరులు ఎలివేషన్లు ఇచ్చుకోవచ్చు. కానీ, సామాన్య జనం మాత్రం ఇలాంటి చేష్టలను అస్సలు భరించలేరు. మరీ ముఖ్యంగా.. అధికారంలో ఉన్నవాళ్ల విషయంలో!..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక.. ప్రతీకార దాడులు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. ఇది చాలదన్నట్లు అధికార పార్టీ నేతలు తమ తమ చేష్టలతో వరుసగా వార్తల్లోకి ఎక్కుతున్నారు. మొన్న మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య ఓ ఎస్సైపై రుసరుసలాడారు. నిన్న ఎమ్మెల్యే కొలికపూడి.. వైఎస్సార్‌సీపీ నేత ఇంటిని జేసీబీతో కూల్చేసేందుకు జేసీబీతో నానా రచ్చ చేశారు. ఈ వ్యవహారాలన్నింటినీ టీడీపీ అనుకూల మీడియానే ‘అత్యుత్సాహం’ పేరిట ప్రముఖంగా ప్రచురించడం గమనార్హం.
అయితే.. ఇలాంటి వ్యవహారాలతో వారికే కాదు, పార్టీకి కూడా చెడ్డపేరు వస్తుంది. గత పాలనలో అధికార పార్టీ నేతలు.. ప్రతిపక్షాల అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారు. అవి జనంలోకి బాగా వెళ్లాయి. వైఎస్సార్‌సీపీ ఓటమి కారణాల్లో అది కూడా ఉందనే చర్చా నడిచింది. కానీ, ఇప్పుడు ఏకంగా.. అధికారంలో ఉన్నవాళ్లు మాటలతో సరిపెట్టుకోవడం లేదు. ప్రతీకార చర్యలతో చేతలకు దిగుతున్నారు.
మంత్రి భార్య, కొలికపూడి మాత్రమే కాదు.. జేసీ లాంటి వాళ్లు అధికారుల్ని నరికేస్తామని హెచ్చరించినా, టీడీపీ వాళ్లు వెళ్తే కుర్చీ వేసి టీ ఇవ్వాలని అధికారుల్ని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించినా, తమకు తగ్గట్లు నడుచుకోవాల్సిందేనని మిగతా మంత్రులు హెచ్చరించినా.. ఇవన్నీ అధికారం ఇప్పటికే వాళ్లకు తలకెక్కిందనే సంకేతాల్ని ప్రజల్లోకి బలంగా పంపించక మానదు. అధికారం ఉందని.. అడిగేవారు లేరని అనుకోవద్దు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కాబట్టి, జనాలు ఇలాంటి అమర్యాదకర ప్రవర్తనను మెచ్చరనే విషయం ఇప్పటికైనా కూటమి నేతలు గుర్తిస్తే మంచిది.
::: సోషల్ మీడియాలో ఓ సిటిజన్
Comments
Please login to add a commentAdd a comment