చేవెళ్ల రణక్షేత్రం..సంపన్నుల సమరం! | Sakshi
Sakshi News home page

చేవెళ్ల రణక్షేత్రం..సంపన్నుల సమరం!

Published Sun, Apr 28 2024 5:02 AM

All the candidates of the 3 major parties in the Lok Sabha are millionaires

లోక్‌సభ బరిలో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులూ కోటీశ్వరులే

ముస్లిం ఓట్లను నమ్ముకున్న కాంగ్రెస్‌ 

దేశాభివృద్ధి, మోదీ చరిష్మాపై ఆధారపడ్డ బీజేపీ 

బీసీ ఓటర్లపై బీఆర్‌ఎస్‌ గంపెడాశలు 

త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారన్న విషయమై అందరిలో ఉత్కంఠ 

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అందరి దృష్టి చేవెళ్లపైనే ఉంది. పల్లె, పట్టణాల కలబోతతో కూడిన ఈ లోక్‌సభ స్థానంలో మూడు ప్రధాన పార్టీలే కాదు.. ముగ్గురు సంపన్నులు పోటీ పడుతుండటమే ఇందుకు కారణం.

గులాబీ కోటలో కమలం పువ్వును వికసింపజేయాలని బీజేపీ.. హస్తం హవా కొనసాగించాలని కాంగ్రెస్‌ భాస్తోంది. 2009లో మినహా ఇప్పటివరకు ఇక్కడ ఏ ఎన్నిక వచ్చినా కారుదే హవా. ఈసారి ఎలాగైనా కారు స్పీడ్‌కు బ్రేకులు వేయాలని బీజేపీ, కాంగ్రెస్‌ భావిస్తున్నాయి. బలమైన అభ్యర్థులను బరిలోకి దించాయి. అయితే ఒకసారి గెలిచిన వారు రెండోసారి విజయం సాధించిన చరిత్ర లేకపోవడంతో ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

అంచనాలకు అందవు.. వ్యూహాలకు చిక్కరు 
అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, అనుబంధ పరిశ్రమలకు నెలవైన చేవెళ్ల లోక్‌సభ స్థానంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓటర్లే కాదు.. ఉత్తరాది ఓటర్లు కూడా ఉన్నారు. వారిలో ముస్లింలు 15 శాతం, ముదిరాజ్‌లు 15 శాతం, మాదిగలు 15.71 శాతం, గౌడ్‌లు 9.50 శాతం, మాలలు 7.86 శాతం, యాదవులు 7.86 శాతం, లంబాడీలు 6.57 శాతం, రెడ్లు 5 శాతం, కమ్మలు 3.43 శాతం, లింగాయత్‌లు 3.36 శాతం, మున్నూరుకాపులు 3 శాతం ఓటర్లు ఉన్నట్లు అంచనా.

అభ్యర్థుల గెలుపోటములను ముస్లింలు, ముదిరాజ్‌లే డిసైడ్‌ చేయనున్నారు. అయితే ఓటర్ల తీరు అంచనాలకు అందడం లేదు. రాజకీయ వ్యూహాలకు కూడా చిక్కడం లేదు. 2009 నుంచి ఇప్పటివరకు జరిగిన ఈ మూడు ఎన్నికల్లో ఇదే అంశం స్పష్టమైంది. 2009లో కేంద్ర మాజీ మంత్రి ఎస్‌. జైపాల్‌రెడ్డి ఇక్కడ గెలవగా ఆ తర్వాత ఆయన మళ్లీ ఈ స్థానం నుంచి పోటీ చేయలేదు. 2014లో బీఆర్‌ఎస్‌ నుంచి ప్రస్తుత బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 

2009 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ మధ్య ఉత్కంఠ పోరు నెలకొనగా కాంగ్రెస్‌ అభ్యర్థి ఎస్‌. జైపాల్‌రెడ్డి 18,532 ఓట్ల ఆధిక్యంతో జితేందర్‌రెడ్డిపై విజయం సాధించారు. ఇక్కడ 64.5 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇద్దరి అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 1.7 శాతమే కావడం గమనార్హం. 

మొత్తం ఓట్లు: 16,81,664    పోలైన ఓట్లు: 10,83,490 
అభ్యర్థి                     పార్టీ        వచ్చిన ఓట్లు    శాతం 
ఎస్‌.జైపాల్‌రెడ్డి       కాంగ్రెస్‌    4,20,807          38.80 
ఏపీ జితేందర్‌రెడ్డి    టీడీపీ       4,02,275         37.10
2014 ఎన్నికల్లో 60.20 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇందులో నోటాకు 10,018 ఓట్లు రాగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 73,023 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్‌ అభ్యర్థి పటోళ్ల కార్తీక్‌రెడ్డిపై గెలిచారు. 
 

మొత్తం ఓట్లు: 23,02,163    పోలైన ఓట్లు: 13,00,194 
అభ్యర్థి                            పార్టీ           వచ్చిన ఓట్లు    శాతం 
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి    టీఆర్‌ఎస్‌          4,35,077      33.10 
పి.కార్తీక్‌రెడ్డి                   కాంగ్రెస్‌            3,62,054      27.50 
2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య గెలుపు దోబూచులాడింది. చివరికి అప్పటి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి 1.1 శాతం ఓట్ల తేడాతో విజయం సాధించారు. నోటాకు 9,244 ఓట్లు పోలయ్యాయి.

మొత్తం ఓట్లు: 21,85,179   పోలైన ఓట్లు: 13,15,862 
అభ్యర్థి                          పార్టీ            వచ్చిన ఓట్లు    శాతం 
జి.రంజిత్‌రెడ్డి             టీఆర్‌ఎస్‌     5,28,148          40.60 
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి    కాంగ్రెస్‌        5,13,831          39.05
 

ముగ్గురూ కోటీశ్వరులే.. 
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (బీజేపీ) రూ.4,490 కోట్లు 
గడ్డం రంజిత్‌రెడ్డి (కాంగ్రెస్‌) రూ.869.77 కోట్లుకాసాని 
జ్ఞానేశ్వర్‌ (బీఆర్‌ఎస్‌) రూ. 520.70 కోట్లు 

అభ్యర్థులు వారే.. పార్టీలే వేరు 
ప్రస్తుతం బరిలో నిలిచిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గతంలో వేర్వేరు పార్టీల నుంచి తలపడిన వారే. ప్రస్తుతం వారు మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి ఇటీవల బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన సంప్రదాయ కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుతోపాటు రాజేంద్రనగర్, మహేశ్వరం, చేవెళ్ల, శేరిలింగంపల్లి, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ముస్లిం ఓటర్లపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు హామీని ఎన్నికల్లో ప్రధానాస్త్రంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రధాని మోదీపైనే భారం వేశారు. మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి వంటి అర్బన్‌ ఏరియాల్లో ఉన్న బీజేపీ కేడర్, మోదీ అభిమానులను ఆయన టార్గెట్‌గా ఎంచుకున్నారు.
 

చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరులో వ్యక్తిగత పరిచయాలను నమ్ముకున్నారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్, శాసనమండలి సభ్యుడు కాసాని జ్ఞానేశ్వర్‌ పోటీ పూర్తిగా బీసీ ఓటర్లనే నమ్ముకున్నారు. లోక్‌సభ స్థానంలో 16.50 లక్షల బీసీలు ఉంటారని, వారే తనను గెలిపించనున్నారనే ధీమాతో ఉన్నారు.  

Advertisement
Advertisement