ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త చీఫ్‌గా దగ్గుబాటి పురంధేశ్వరి ఎట్టకేలకు బాధ్యతలు స్వీకరించారు. తొలి ప్రసంగంలోనే కేంద్రంలోని అధికారపక్షం.. రాష్ట్రంలో పెద్దగా ప్రభావం లేని బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకుని అగ్రెసివ్‌గా మాట్లాడారామె. అదే సమయంలో రాబోయే రోజుల్లో ఆమె నుంచి ఎలాంటి రాజకీయ విమర్శలు ఆశించొచ్చనే ఆసక్తి నెలకొంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడితో ఆమె వైఖరి ఎలా ఉండబోతుంది?.. టీడీపీని ఆమె ఎలా డీల్ చేస్తారనే విశ్లేషణ ప్రధానంగా నడుస్తోంది.
రాజకీయాల్లో దగ్గుబాటి పురంధేశ్వరి రూటే.. సెపరేటు. ఎన్టీఆర్ కుమార్తెగానే ఆమె పేరు పరిచయం అయినా.. రాజకీయానుభవం.. పనితీరు కారణంగానే తనదైన ముద్ర వేసుకున్నారామె. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీకి మారిపోయినా కూడా.. అక్కడా తన స్థానాన్ని గౌరవప్రదంగానే కొనసాగిస్తూ వచ్చారు. అయితే.. రాజకీయాలపరంగా ఆమె కరుడుగట్టిన చంద్రబాబు వ్యతిరేకి!. అలాంటి వ్యక్తికి బీజేపీ పగ్గాలు అప్పజెప్పి.. చంద్రబాబుకు దూరంగా ఉండాలనే సంకేతాలను బీజేపీ ఇస్తోందా? లేదంటే ఓ సామాజికవర్గానికి చేరువ కావాలనే వ్యూహంతో ముందుకు సాగుతోందా? అనే చర్చ జోరందుకుంది.
జాతీయ స్థాయిలో అగ్రనేతలతో కలివిడిగా ఉండటం, విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి కావడం, ఇతర రాష్ట్రాలకు కూడా బీజేపికి ఉపయోగపడే స్ధాయిలో ఉండటం పురంధేశ్వరికి ప్లస్ అయ్యాయి. అయితే ఓ పార్టీకి అధ్యక్ష హోదాలో ఇప్పుడు ఆమె ముందు పెద్ద బాధ్యతే ఉంది. అది.. టీడీపీని.. ఏపీకి పూర్తి స్థాయిలో నష్టం చేసిన చంద్రబాబును విమర్శించడం!.
మరిది చంద్రబాబు నాయుడు కుటుంబంతో దగ్గుబాటి పురంధేశ్వరికి సత్సంబంధాలు పెద్దగా లేవు. రెండేళ్ల కిందట ఏదో ఫంక్షన్‌లో పతీసమేతంగా గ్రూప్ ఫొటో ఆమె దిగారంతే. ఇక ముఖాముఖి పెద్దగా మాట్లాడుకుంది లేదు!. కానీ.. రాజకీయంగా మాత్రం టీడీపీతో భయంకరంగా విభేదిస్తుంటారామె. ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీని, చంద్రబాబును విమర్శించడం ఆమెకు పెద్ద సమస్యేమీ కాకపోవచ్చు. అదీగాక ఓ పార్టీ అధ్యక్ష హోదాలో.. ప్రత్యర్థుల కోసమైనా విమర్శలకు పదును పెట్టాల్సిన పరిస్థితి ఆమెది.
ఆ రూట్‌లో వెళ్తేనే..
దగ్గుబాటి ఫ్యామిలీ టీడీపీలోకి చేరతారనే అనూహ్య ప్రచార నేపథ్యంలో.. బీజేపీ పురంధేశ్వరిని బీజేపీ చీఫ్‌ను చేసిందనే ప్రచారం ఒకటి నడిచింది. కానీ, అన్నివిధాలుగా చంద్రబాబుకు దూరంగా ఉండే పురంధేశ్వరి అలాంటి ఆలోచన నిజంగా చేస్తారా?. పురంధేశ్వరి ముందు ఇప్పుడున్న కర్తవ్యం.. తనకూ, తన పార్టీకి మైలేజ్ పెరిగే ప్రయత్నం చేస్కోవడం. అందుకోసం సంక్షేమ ప్రభుత్వాన్ని నిందిస్తే.. ప్రజల దృష్టిలో ఆమెనే పల్చన అయిపోతారు. అలాకాకుండా గత హయాంలో అడ్డగోలుగా దోచుకున్న చంద్రబాబును.. ఆయన నేతృత్వంలోని అవినీతి పార్టీని అన్నిరకాలుగా ఏకేయం ఆమెకు అన్నివిధాలుగా లాభం!. ఎందుకంటే 2019 ఎన్నికల్లో బీజేపీ 0.84 శాతం ఓటింగ్‌తో నోటా(1.28 శాతం) కంటే వెనుకబడిపోయింది. టీడీపీ ఓటర్లను ఆకర్షించడం ద్వారా ఆ ఓటింగ్ శాతం పెంచుకోవడం ఆమెకు సాధ్యం కావొచ్చు.
నాన్నకు ప్రేమతో..
పురంధేశ్వరి అనుభవం, మాస్ అప్పీల్ బీజేపీకి ఫ్లస్ అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో.. పురంధేశ్వరి ద్వారా ఎన్టీఆర్ లెగసీని రాజకీయంగా బీజేపీ వాడుకునే ప్రయత్నం చేస్తోందా?.. ‘రామన్న రక్తం.. మోదీ వదిలిన బాణం’ ప్రమోషన్ క్యాఫ్షన్ అందుకేనా? టీడీపీ సామాజిక వర్గ ఓట్లను చీల్చేయడమే.. లేదంటే పూర్తిగా గుంజేసుకోవాలని చూస్తోందా?. పురంధేశ్వరి నియామకం పొత్తుపై అయిష్టత ఎందుకు అనుకోకూడదు?. ఏది ఏమైనా చంద్రబాబును ఆమె తప్పక విమర్శించాల్సిన పరిస్థితి.
1995లో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం ఎపిసోడ్‌లో.. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి.. ఆమె భర్త కూడా ఉన్నారు. ఆపై వాళ్లు పక్కకు జరిగి.. హరికృష్ణ నేతృత్వంలోని అన్నా తెలుగుదేశంలో నడిచారు. కానీ, అది సక్సెస్ కాలేదు. తండ్రిని అవమానించాడనే కారణం చెబుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరారామె. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరారు. అదే చంద్రబాబుతో మంచి సంబంధాలు ఉండి ఉంటే.. టీడీపీలోకి వెళ్లేవారు కదా.. కనీసం మంత్రి పదవి అయినా దక్కి ఉండేది కదా. ఎందుకు ఆ పని చేయలేదు. ఎందుకంటే.. తండ్రి వెన్నుపోటు వ్యవహారంలో చంద్రబాబుపై ఆమె అంత విరక్తితో ఉన్నారు కాబట్టి.
కొసమెరుపు.. ఎన్టీఆర్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అందించాలనే డిమాండ్ ఒకటి ఉంది. పైగా బీజేపీ కూడా నారా లోకేష్‌ను ఖర్జూరనాయుడి మనవడిగానే భావిస్తోంది. అందుకే ఎన్టీఆర్ అసలైన మనవడు జూనియర్ ఎన్టీఆర్‌తో బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇక ఎన్టీఆర్ తనయ, చంద్రబాబు వ్యతిరేకి దగ్గుబాటి ఫురంధేశ్వరికి ఏకంగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పింది. ఈ పరిణామాలు చూస్తుంటే.. వచ్చే ఏడాదిలో ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!.
Comments
Please login to add a commentAdd a comment