బాలకృష్ణ, దత్తపుత్రుడికి జిరాక్స్‌ కాపీలిచ్చారా?: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ, దత్తపుత్రుడికి జిరాక్స్‌ కాపీలిచ్చారా?: చిలకలూరిపేట ప్రచారంలో సీఎం జగన్‌

Published Sat, May 11 2024 12:40 PM

AP Elections 2024: CM YS Jagan Election Speech At Chilakaluripet

పల్నాడు, సాక్షి:  లంచాలు,అవినీతి లేని పాలనతో పథకాలు కొనసాగాలన్నా, ఇంటింటి అభివృద్ధి జరగాలన్నా.. జగన్‌కు ఓటేయాలని, పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ముగింపుతో పాటు మోసపోతారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం ఉదయం చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన ప్రచార సభలో  ఆయన పాల్గొని‌ ప్రసంగించారు.

చిలకలూరిపేట సిద్ధమా?.. దేవుడి దయతో ఇవాళ వాతావరణం చల్లగా ఉంది. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ మీ బిడ్డకు అండగా, తోడుగా ఉంటున్న నా ప్రతీ అక్కకూ, నా చెల్లెమ్మకి, నా ప్రతీ అవ్వకు, నా ప్రతి తాతకు, నా  ప్రతీ సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ ..మీ అందరికి మీ బిడ్డ జగన్‌ రెండు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.

జరగనున్నాయి ఎన్నికల సమరం. బ్యాలెట్‌ బద్దలు కొట్టేందుకు సిద్ధమేనా?. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం.  చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే.

దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. నేరుగా వారి చేతికే డబ్బులు వెళ్లిపోతాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.

మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా వారి చేతికే రావడం అన్నది గతంలో జరిగాయా?

గతంలో ఎప్పుడూ చూడని విధంగా  2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ 59 నెలల పాలనలో మీ బిడ్డ ఇవ్వగలిగాడు. ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చేవారు. ఎన్నికలయ్యాక చెత్త బుట్టలో వేసే పరిస్థితిని మీ బిడ్డ మార్చాడు. మేనిఫెస్టోను ఒక బైబుల్ గా ఒక ఖురాన్‌గా ఒక భగవద్గీతగా నిర్వచనమిస్తూ.. ఏకంగా 99% హామీలు నెరవేర్చి, ఆ మేనిఫెస్టోను ప్రతీ అక్కచెల్లెమ్మల ప్రతీ  ఇంటికి పంపించాడు. మీరే టిక్కు పెట్టండి అంటూ విశ్వసనీయత పరిస్థితి ఈ 58 నెలల కాలంలోనే జరిగింది.

ఇప్పుడు నేను గడగడా గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేర్లు చెబుతా.  గవర్నమెంట్‌ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్లు.. ఐబీ దాకా ప్రయాణం. గవర్నరమెంట్‌ బడుల్లో చదివే పిల్లల కోసం బైలింగువల్‌ టెక్స్ట్‌ బుక్‌లు. బడులు తెరిచేసరికే విద్యాకానుక. బడుల్ పిల్లలకు గోరుముద్ద. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా.. పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి. పెద్ద చదవుల కోసం  ఏ తల్లీ తండ్రీ అప్పులపాలు అవ్వకూడదని.. మెడిసిన్‌, డిగ్రీలు చదువుతున్న పిల్లల కోసం 93 శాతం పూర్తి ఫీజులు కడుతూ..  ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన..గతంలో ఎప్పుడైనా జరిగాయా?

నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని.. నా అక్కచెల్లెమ్మల కోసం ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్. అందులో ఏకంగా కడుతున్న ఏకంగా 22 లక్షల ఇళ్లు.. గతంలో ఎప్పుడైనా జరిగాయా?

నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్‌. ఇంటి వద్దకే రేషన్‌, పౌర సేవలు. పథకాలు.. గతంలో మీ ఇంటి వద్దకే ఎప్పుడైనా వచ్చాయా?. గతంలో ఎప్పుడైనా జరిగిందా?, మొట్టమొదటిసారిగా.. రైతన్నకు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ.. పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా. మొదటిసారిగా రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, మొట్టమొదటిసారిగా సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ, మొట్టమొదటిసారిగా పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, గ్రామంలో ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇన్నిన్ని మార్పులు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.

వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడుతూ.. సొంతంగా ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర,  నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా.. ఫుట్‌పాత్‌ల మీద శ్రమజీవులను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా?. ఇవాళ వాళ్లకు ఓ తోడు.. బ్రహ్మణులకు, రజకులకు ఓ చేదోడు, లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?

ఏ పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని.. ఏకంగా రూ. 25 లక్షలకు విస్తరించిన ఆరోగ్యశ్రీ.  రెస్ట్‌ పీరియడ్‌లో పేదవాడికి ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్‌. ఇంటికే టెస్టులు చేస్తూ.. మందులిస్తున్న ఆరోగ్య సురక్ష. ఇంతంగా పేదవాడి ఆరోగ్యం కోసం ఇంతలా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా?.

గ్రామంలోకి అడుగుపెడుతూనే ఒక సచివాలయ వ్యవస్థ. ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్‌. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడు ద్వారా బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌. మరో నాలుగు అడుగులు వేస్తే కనిపిస్తుంది ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరరీ. మొట్టమొదటిసారి నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. మొట్టమొదటిసారి అక్కచెల్లెమ్మల ఫోన్‌లో దిశ యాప్. ఏ ఆపదలో ఉన్నా.. ఫోన్‌ ఐదుసార్లు షేక్‌ చేసినా చెల్లెమ్మా ఏం జరిగింది అని అడుగుతున్న పరిస్థితి. లంచాలు, అవినీతి లేని పాలన..  

నేను చెప్పినవన్నీ కూడా గతంలో లేనివి...మీ బిడ్డ పాలనలో ఈ 59 నెలల్లో జరిగినవి.. నిజమా? కాదా? అని అడుగుతున్నాను.

కుట్రలు గమనించాలి
జరగబోయేది రెండు కులాల మధ్య యుద్ధం కాదు. రెండు సిద్దాంతాల మధ్య యుద్ధం జరుగుతోంది. పేదవాడు ఒకవైపు.. పెత్తందారు ఒకవైపు ఉన్నారు. జరుగుతున్న కుట్రలు గమనించాలి. రెండు నెలల కింద దాకా అవ్వాతాతలకు పెన్షన్‌ ఇంటికే వచ్చేది. అలాంటిది.. ఎక్కడ మీ బిడ్డకు మంచి పేరు వస్తుందో అని పెన్షన్‌ ఆపేసి..  ఆ అవ్వాతాతల ఉసురు తగిలించుకున్నారు.

ఏ ప్రభుత్వమైన 60 నెలల కోసం ప్రజలు ఎన్నుకుంటారు. కానీ, 57 నెలలకే  మీ బిడ్డ ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మీ బిడ్డ బటన్‌లు నొక్కిన సొమ్మును ఆ అక్కాచెల్లెమ్మలకు ఇవ్వకుండా ఢిల్లీతో కలిసి కుట్రలు చేస్తున్నారు. ఈ డబ్బంతా ఎన్నికలయ్యాక ఇస్తారట. 14వ తేదీ ఇస్తారట. ఇది కుట్ర కాదా?. అయినా ఫర్వాలేదు. కారణం ఏంటంటే.. నాకు కావాల్సింది.. నా అక్కాచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం. వాళ్ల పిల్లల చదువులు, రైతన్నల ముఖంలో సంతోషం.

అలాగే.. ల్యాండ్‌ టైటిలింగ్‌యాక్ట్‌, రిజిస్ట్రేషన్‌ల మీద ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో చూస్తున్నాం. ఇదే చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ విశాఖలో, దత్తపుత్రుడు(పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి..) ఏపీలో భూములు కొన్నారు. మరి వారికి ఒరిజినల్‌ ఇచ్చారా?.. మరి జిరాక్స్‌లు ఇచ్చారా? అని అడుగుతున్నా. ఏపీలో 9 లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేయించారు. కానీ, చంద్రబాబు దుష్ప్రచారం ఏ స్థాయిలో ఉందో గమనించాలి అని సీఎం జగన్‌ కోరారు.

Advertisement
 
Advertisement